భద్రాద్రిపై వెనుకాడేది లేదు

22 Nov, 2013 05:01 IST|Sakshi

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ విషయంలో కేంద్రం వెనుకాడితే ..వెంటాడుతామని  హెచ్చరించారు. భద్రాచలం డివిజన్‌ను జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం టీజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సామూహిక నిరాహారదీక్షలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రాచలం కోసం రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. భద్రాద్రిని సీమాంధ్రలో కలపాలనే ప్రతిపాదన వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 56 ఏళ్ళుగా సీమాంధ్ర నాయకులు దోచుకున్నది చాలక మళ్ళీ తెలంగాణను అడ్డు కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. భూములు, గనులు సరిపోక భద్రాచలం, హైదరాబాద్, శ్రీశైలం కావాలని అడుగుతున్నారని తెలిపారు. భద్రాద్రి రాముడిపై సీమాంధ్రులకు ఏమాత్రం ప్రేమ లేదని, నీళ్ళు, నిధులు, ఖనిజాలను దోచుకునేందుకేనని ఆరోపించారు. జిల్లా నుంచి భద్రాచలాన్ని విడదీయాలని చూస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.
 
 భద్రాచలాన్ని జిల్లా నుంచి వేరుచేయాలని నివేదికలు పంపడం దారుణమన్నారు. ప్రజా పోరాటంలో తప్పుడు నివేదికలన్నీ కొట్టుకుపోతాయన్నారు. రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వమన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి అనేక కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అయినా ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళామని చెప్పారు. కేంద్రం స్పందించని కారణంగా తమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు 24వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడుతారని చెప్పారు. ఉద్యోగులుగా ఉంటూ తెలంగాణ కోసం పోరాడి ఆర్థికంగా, మానసికంగా, కేసులతో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకొకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. పోలవరం నిర్మాణం కోసం భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని అడుగుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. జిల్లా నుంచి సీమాంధ్రులకు అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదన్నారు. భద్రాచలాన్ని జిల్లా నుంచి విడదీసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ జిల్లా కన్వీనర్ క నకాచారి, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె ఖాజామియా, టీ డైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొలగాని కోటేశ్వరరావు, టీటీజేఏసీ జిల్లా అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలాన్ని ఇవ్వకపోవడం తెలంగాణను అడ్డుకోవడంలో భాగమేనని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు ఆరోపించారు. ఈ సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ కూడా మాట్లాడారు.
 
 భారీ ప్రదర్శనలు...
 ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవో, నాల్గో తరగతి ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జడ్పీసెంటర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా తిరిగి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మరో ప్రదర్శన తీసింది. దీనిలో అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శననిర్వహించారు. టీడీపీ, టీఆర్‌ఎస్, లోక్‌సత్తాలు కూడా వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించా యి. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఉద్యోగులు మల్లెల రవీంద్రప్రసాద్, నాగ మల్లేశ్వరరావు, రామచందర్‌రా వు, కిశోర్ రెడ్డి, టీఎన్‌జీవో నా యకులు వేణుగోపాల్, బాల కృష్ణ, దుర్గాప్రసాద్, వల్లోజు శ్రీని వా స్, ఆర్‌వీఎస్ సాగర్, రమణయాదవ్,ప్రసా ద్, టీజీవోనా యకులు వై.వెంకటేశ్వర్లు, మదన్ సింగ్, మురళి, కృష్ణారావు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు గట్టికొండ నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, శిరోమణి, మంగతా యి, ఝాన్సీ, టీఆర్‌ఎస్‌నాయకులు అబ్దుల్‌నబీ, తవిడి శెట్టి రామారావు, సుబ్బారావు, టీడీపీ నాయకులు మదార్‌సాహెబ్, రాయపూడి జైకర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అంచా లక్ష్మణ్, లోక్‌సత్తా జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రునాయక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు