‘భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి’

25 Jun, 2014 01:53 IST|Sakshi
‘భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి’
 భీమవరం టౌన్ :  తెలంగాణలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా సీమాంధ్రలో కలి పితే తప్ప పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం కాదని రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవీ.సూర్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం భీమవరం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన ంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించిన 90 వేల ఎకరాలు భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌లో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను మాత్రమే సీమాంధ్రలో కలుపుతున్నట్లు ఉందన్నారు. ఈ మండలాల్లో నిర్వాసితులకు కేటాయించేందుకు 30 వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 60 వేల ఎకరాల భూములు చర్ల, వెంకటాపురం, దమ్ముగూడెం, వాజేడు మండలాల్లో ఉన్నాయన్నారు.
 
 ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ నాలుగు మండలాలు 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావాలంటే ఈ నాలుగు మండలాలను కూడా సీమాంధ్రలో కలపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రులు, ఇంజినీర్లు తెలంగాణ కు చెందిన వారే కావడంతో ఆ ప్రాంతానికే ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించారన్నారు. 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకుని జాతీయ హోదా కల్పించాలన్నారు. పోలవరం సాధనకు వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వె ళ్లి అక్కడ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సహకారంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాల కృష్ణంరాజు, మంతెన కృష్ణంరాజు, పీవీ సీతారామరాజు, సూర్యారావు, గంటా సుందర్‌కుమార్, వడ్డి సుబ్బారావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు