ప్రజలకు మరింత చేరువగా ఎంపీ భరత్‌ రామ్‌ 

3 Nov, 2019 08:14 IST|Sakshi
యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ భరత్‌ రామ్‌ తదితరులు

‘భరత్‌ రామ్‌’ యాప్‌ ఏర్పాటు 

24 గంటలూ ప్రజలకు అందుబాటు 

సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు ‘భరత్‌ రామ్‌’ యాప్‌ను రూపొందించినట్టు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ తెలిపారు.  నగరంలోని అమరావతి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేషన్‌ కంపెనీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘భరత్‌ రామ్‌’ యాప్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్‌ ద్వారా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గ పరిధిలో అందరినీ కలవడం సాధ్యం కావడం లేదని, అందుకే ఈ యాప్‌ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వీడియోలు, పోస్టులను ఈ యాప్‌లో పెట్టవచ్చన్నారు. ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి భరత్‌ రామ్‌ అని టైప్‌ చేస్తే యాప్‌ వస్తుందని, దాన్ని ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుందన్నారు.  

నియోజకవర్గ పరిధిలోని ప్రజలు సమస్యలే కాకుండా సూచనలు కూడా ఇవ్వవచ్చన్నారు. ఈ యాప్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్న పథకాలను కూడా ఉంచామన్నారు. తన పర్యటనకు సంబంధించిన ముందుస్తు సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దీనిలో ఉపాధికి సంబంధించిన ఐకాన్‌ కూడా ఉందని, దీని ద్వారా ఉపాధికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ యాప్‌లో ఉంచడంతో పాటు ఇప్పటివరకూ ఎంతవరకు అమలు చేశామన్న విషయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ యాప్‌ ద్వారా ప్రజల దృష్టిలో ఉంచుతామని తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభమని, స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారందరూ ఈ యాప్‌ను లోడ్‌ చేసుకుని నియోజకవర్గ అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యాప్‌ను రూపొందించిన అమరావతి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఎండీ అనిల్‌కుమార్‌ చింతాను అభినందించారు.    

మరిన్ని వార్తలు