మిమ్మల్ని సస్పెండ్‌ చేయకపోతే.. సీఎండీకి ఉంటది!

21 Mar, 2018 12:18 IST|Sakshi

మీ మీద దాడులు వద్దని ఏసీబీకి నేనే చెప్పా

నా మీద తిరగబడితే వారిని పంపించాల్సిఉంటుంది

డీఈ, ఏడీఈ, ఏఈలపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఫైర్‌

కలకలం రేపుతున్న భార్గవరాముడు ఫోన్‌ సంభాషణ

‘‘సిమ్‌లు వెనక్కిస్తామని నన్నే బెదిరిస్తారా? అశాంతి నెలకొల్పుతున్నారంటూ మీ మీద సీఎండీకి లెటర్‌ పెట్టానంటే వెంటనే సస్పెండ్‌ అవుతారు జాగ్రత్త! ఒకవేళ చేయకపోతే సీఎండీకి మళ్లీ వేరే విధంగా ఉంటుంది. వీరేష్‌ మీద నేనే ఏసీబీ వారికి చెప్పి నిలబెట్టాను. ఇలాగైతే నేనే మళ్లీ చెప్పాల్సి వస్తుంది.. పోయి పడిపోండని. సిమ్‌కార్డు తిరిగిచ్చి చూడండి!’’అంటూ ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఎస్‌పీడీసీఎల్‌) కర్నూలు జిల్లా ఎస్‌ఈ భార్గవరాముడు కిందిస్థాయి ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు  కలకలం రేపుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ భార్గవరాముడు  వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఏకంగా సీఎండీని ఉద్దేశించి..తాను చెప్పినట్లు చేయకపోతే ‘వేరే విధంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించడం ఆయన తీరుకు అద్దం పడుతోంది. కిందిస్థాయి అధికారిపై ఏసీబీ దాడులు చేయకుండా తానే ఆపానని, మళ్లీ తాను చెబితే దాడులు చేస్తారని చెప్పడం కూడా కలకలం రేపుతోంది. ఏసీబీ తన చెప్పుచేతల్లో ఉందనే రీతిలోఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో ఆదోని డివిజన్‌కు చెందిన ఒక ఇంజినీరుతో ఎస్‌ఈ చేసిన ఫోన్‌ సంభాషణ ఆడియో బయటకు రావడం.. అందులోనూ ఆయన వ్యాఖ్యల తీరుపై ఆ శాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.

మేం పనిచేయలేం!
ఎస్‌ఈ భార్గవరాముడు తమను సాటి ఇంజినీర్లని కూడా చూడకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ఆదోని డివిజన్‌కు చెందిన డీఈతో పాటు ఏడీఈ, ఏఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై నేరుగా సీఎండీతో పాటు వివిధ ఇంజినీర్ల సంఘాలకు  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలను సహించడం తమ వల్ల కాదని, మరీ బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాము పనిచేయలేమంటూ సెలవుపై వెళ్లాలని భావిస్తున్నారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో డీఈ, ఏడీఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారన్న సమాచారంతో  ఎస్‌ఈ ఒక ఇంజినీరుకు ఫోన్‌ చేశారు. మిమ్మల్ని సస్పెండ్‌ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా ఏసీబీ పేరు కూడా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. తన మాట విని ఏసీబీ అధికారులు మీరు అవినీతి చేస్తున్నా చూడకుండా వదిలేశారనే అర్థంలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ ఆడియోటేపు ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో సదరు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.  

వేధింపుల పర్వం
విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వ్యవహారశైలి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంటోంది. ఉద్యోగులతో ప్రవర్తించే తీరు సరిగా లేదని, వారితో మాట్లాడే భాష చాలా అసహ్యంగా ఉంటోందనే విమర్శలున్నాయి. ఆయన వాడిన బూతు పదాలను కూడా పేర్కొంటూ ఈ ఎస్‌ఈ కింద తాను పనిచేయలేనని, బదిలీ చేయాలంటూ ఆదోని డివిజన్‌ డీఈ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదే తరహాలో పలువురు ఇంజినీర్లు కూడా ఎస్‌ఈ వ్యవహారశైలిపై లోలోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. చెప్పడానికి వీలులేని భాషలో తిడుతూ తమను కించపరుస్తున్నారని వారు వాపోతున్నారు. మొత్తమ్మీద ఎస్‌ఈ భార్గవరాముడు మాట్లాడిన ఆడియోటేపు ఇప్పుడు ఈ శాఖలో కలకలం రేపుతోంది.    

మరిన్ని వార్తలు