ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు 

9 Dec, 2019 11:04 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్పీ భాస్కర్‌భూషణ్‌  

శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి

మాఫియాలపై కఠిన చర్యలు నూతన  ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ 

సాక్షి, నెల్లూరు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహించి మెరుగైన శాంతిభద్రతలను అందిస్తానని జిల్లా నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ వెల్లడించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆదివారం ఉదయం 7.45 గంటలకు నూతన పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో భాస్కర్‌భూషణ్‌ జిల్లా 43వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువచేసి పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. పోలీసు ఉన్నది ప్రజలకోసమేననే భావన కలి్పంచేలా విధులు నిర్వహించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీనవర్గాల వారి రక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రికవరీలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు.

నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక శక్తుల పీచమణుస్తామన్నారు. ప్రధానంగా క్రికెట్‌బెట్టింగ్, మైనింగ్, ఎర్రచందనం మాఫియాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామన్నారు. చట్టాన్ని ఉపేక్షించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.  పోలీసుశాఖకు మూల స్తంభాలైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌యాక్ట్‌ అనే మూడు అంశాలకు కట్టుబడి జిల్లా పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలకు లోబడి సిబ్బంది అందరూవిధులు నిర్వహిచాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేస్తామని చెప్పారు. తొలుత ఆయన సిబ్బందినుంచి గౌరవవందనం స్వీకరించారు. పండితులు పూర్ణకుంభంతో ఎస్పీకి స్వాగతం పలికారు.  

2009 ఐపీఎస్‌ బ్యాచ్‌ 
భాస్కర్‌భూషణ్‌ బిహార్‌ రాష్ట్రం ధర్మాంగ జిల్లా క్యూటీకు చెందినవారు. ఆయన ప్రా«థమిక విద్యాభ్యాసం రాంచీలో సాగింది. ఖరగ్‌పూర్‌ ఐఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. చెన్నై, సింగపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సివిల్స్‌ రాసి 2009లో ఐపీఎస్‌ అధికారిగా పోలీసుశాఖలో ప్రవేశించారు. కరీంనగర్‌లో శిక్షణ పొందిన ఆయన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏఎస్పీగా, అదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో ఓఎస్‌డీగా విధులు నిర్వహించారు. 2015 నుంచి 17వరకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా, డీజీ కార్యాలయంలో ఐఏజీ అడ్మిన్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పోలీసు బదిలీల్లో నెల్లూరు ఎస్పీగా నియమితులయ్యారు. పనిచేసిన ప్రతిచోట సమర్థవంతమైన అధికారిగా పేరుగడించారు.  

సిబ్బంది శుభాకాంక్షలు 
నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఏఎస్పీ క్రైమ్స్‌ పి.మనోహర్‌రావు, ఏఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, ఎస్‌బీ, నెల్లూరు నగర, రూరల్, ఏఆర్, హోమ్‌గార్డ్స్‌ డీఎస్పీలు ఎన్‌.కోటారెడ్డి, జే శ్రీనివాసులరెడ్డి, కేవీ రాఘవరెడ్డి, రవీంద్రరెడ్డి, డి. శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు మధుబాబు, వేమారెడ్డి, రాములునాయక్, మిద్దెనాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, బి. శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐలు మౌలుద్దీన్, వెంకటరమణ, ఎంటీవో గోపినాథ్, ఎస్‌బీ ఎస్సై సాయి  శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు