భీమేశ్వరునికి.. నందీశ్వరునికీ నడుమ...∙

25 Apr, 2018 13:16 IST|Sakshi
ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి ఆలయంలో మూల విరాట్‌కు ఎదురుగా ఉండే నందీశ్వరుడు

మండపం ఏర్పాటుతో శివభక్తుల విస్మయం

అపచారం అంటున్న అర్చక స్వాములు

మార్చాలంటున్న ప్రజలు

ద్రాక్షారామం (రామచంద్రపురం రూరల్‌): సాధారణంగా భక్తులు ఏ శివాలయానికి వెళ్లినా చండీశ్వరుడిని, నందీశ్వరుడిని దర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి మూల విరాట్‌ దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దేవాలయంలో ఆలయ అధికారులు భీమేశ్వరునికి, నందీశ్వరుడికీ మధ్య దాతలు ఇచ్చిన దర్బారు మండపాన్ని ఏర్పాటు చేయడంపై శివ భక్తులు, గ్రామస్తులు, అర్చకులు, పురోహిత పెద్దలు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ దర్బారు మండపానికి అద్దాలు అమర్చి అందులో స్వామివారి మూర్తులను ఉంచి తీర్థం, పాదుకలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సమంజసం కాదంటున్నారు. దీనివల్ల స్వామికి, నందీశ్వరుడికి మధ్య ఆటంకం ఏర్పాటు చేసినట్టవుతుందని, అంతేకాకుండా భక్తుల రద్దీ వేళల్లో భక్తులకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. అక్కడికి బదులుగా భక్తులకు అనుకూలంగా ఉండే మరో చోటుకు ఈ మండపాన్ని మార్చాలని కోరుతున్నారు.

అందరినీ ఆలోచించి చేస్తాం 

కొంతమంది పెద్దల సూచన మేరకు మండపాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే, అందరితో ఆలోచించి మండపం స్థలం మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. 
– పెండ్యాల వెంకట చలపతిరావు, ఈఓ, 
శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు