బాలింత మృతికి కారకురాలైన ఆర్‌ఎంపీపై కేసు

9 Nov, 2014 02:58 IST|Sakshi
బాలింత మృతికి కారకురాలైన ఆర్‌ఎంపీపై కేసు

కళ్యాణదుర్గం : నిర్లక్ష్యంగా కాన్పు చేసి, గర్భిణి మృతికి కారణమైన ఆర్‌ఎంపీ కవితపై పో లీసులు కేసు నమోదు చేశారు. కంబదూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన పై  శనివారం ‘వైద్యం వికటించి బాలింత మృతి ’అనే కథనం ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ సొలామన్‌ఆరోగ్యరాజ్ తీవ్రంగా స్పందించారు. బాలింత సుమ మృతదేహానికి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

కర్ణాటకలోని సావరాటపురం గ్రామానికి చెందిన సుమ కంబదూరులో బంధువుల ఇంటికి వచ్చిం ది. ఎనిమిది నెలల గర్భిణి సుమకు విరేచనాలు కావడంతో వైద్యంకోసం కంబదూరులోని ఆర్‌ఎంపీ కవిత వద్దకు తీసుకెళ్లారు. వైద్యం వికటించి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్... వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆశాఖ ఉన్నతాధికారులతో కంబదూరు వైద్య సిబ్బంది ఎం చేస్తున్నా రు... ఇలాంటి సంఘటనలు  ఎందుకు జరుగుతున్నాయని నిలదీసినట్లు తెలిసింది.  స్థానిక సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పురుషోత్తం కంబదూరు ఆస్పత్రికి వెళ్లి అక్కడి డాక్టర్ రంగవేణి, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గర్భిణి సుమ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లడాన్ని ఎందుకు పసిగట్టలేక పోయారని నిలదీశారు.

సంబంధిత ఆశావర్కర్ గౌరమ్మ తాను గర్భిణి సుమతో ప్రసవం విషయమై సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదని సమాధానమిచ్చింది. ఇకపై ఏ గర్భిణి ఆర్‌ఎంపీలను ఆశ్రయించకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.

 మృతదేహానికి పోస్టుమార్టం
 బాలింత సుమ మృతదేహాన్ని స్వగ్రామం కర్ణాటకలోని సావరాటపురానికి భర్త నటరాజ్, కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆర్‌ఎంపీ వైద్యంతోనే మృతి చెందినందున పోస్టుమార్టం నిర్వహించాలని ఎస్‌ఐ శ్రీదర్ ఆ గ్రామానికి వెళ్లి బాధితులకు నచ్చజెప్పారు. దీంతో మృతదేహాన్ని తిరిగి కంబదూరుకు తీసుకువచ్చారు. తహశీల్దార్ తిమ్మప్పతో ఎస్‌ఐలో చర్చించారు. అనంతరం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్‌ఎంపీపై చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 ఆర్‌ఎంపీలకు కాన్పులు చేసే అర్హత లేదు
 ఆర్‌ఎంపీలు కాన్పులు చేయడానికి అనర్హులని, అలా చేస్తే నేరమని  సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు.  మొదటి, రెండవ కాన్పులు ఆస్పత్రులలోనే జరపాలనే ప్రభుత్వ నిబంధనలున్నాయని, గర్భిణి సుమను ప్రభుత్వాస్పత్రికి పంపించాలన్నారు. అయితే ఎనిమిది నెలల గర్భిణికి ఆర్‌ఎంపీ ప్రసవం చేయడంతో రక్త స్రావం జరిగి ఆమె మరణానికి దారితీసిందన్నారు. సాక్షి ద్వారా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. తెలసి తెలియని వైద్యంతో ప్రాణాలు తీసేవారి పై చర్యలు తీసుకుని అరికట్టేందేకు అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు