అందరివాడు..అందనివాడు

24 Mar, 2019 12:08 IST|Sakshi

భీమవరం నియోజకవర్గ ప్రజల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సింది నిత్యం తమ మధ్యే ఉంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌నా? 
సినీగ్లామర్‌తో రాజకీయాల్లోకి ప్రవేశించి రెండుచోట్ల నుంచి బరిలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌నా? ఏ సమస్య వచ్చినా ప్రజల ముందుండి పోరాడే గ్రంధి శ్రీనివాస్‌ ఒకవైపు బరిలో ఉంటే, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎలా కలవాలో తెలియని పవన్‌ కళ్యాణ్‌ మరోవైపు బరిలో ఉన్నారు. మరోవైపు పవన్‌ ఎన్నికల తర్వాత గాజువాకను ఉంచుకుని భీమవరాన్ని వదిలేస్తారనే ప్రచారం జనసేన వర్గాల్లోనే జోరుగా జరుగుతుంది.


సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్‌ కళ్యాణ్‌ ప్రజాసమస్యల కోసం ఏనాడూ ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినన్ని రోజులు ఇక్కడ పోలీసుల నిర్బంధకాండపై, మొగల్తూరులో ఆక్వా పరిశ్రమలో ఐదుగురు చనిపోయినా ఎన్నడూ స్పందించలేదు. నామినేషన్‌ వేసిన తర్వాత కూడా కేవలం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని మాత్రమే టార్గెట్‌ చేసిన పవన్‌ కళ్యాణ్, పదేళ్లుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబును పల్లెత్తు మాట కూడా అనలేదు. దీన్నిబట్టి అక్కడ తెలుగుదేశం–జనసేన బంధం ఎంత గట్టిగా ఉందో అర్థం అవుతుంది. కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (సీపీఎఫ్‌) అంటూ హడావిడి మొదలుపెట్టిన పవన్‌కళ్యాణ్‌ దాని పేరిట  రూ.2 కోట్లు డిపాజిట్‌ చేస్తున్నామని.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా, ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా డైలాగులు చెప్పారు. తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. సీపీఎఫ్‌ ఏమైందో తెలియదు.

మళ్లీ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకుని బాబుతో జతకలిశారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. 2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్‌ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా ప్రతి ఎన్నికకి గుర్తులు మారుస్తూ ప్రజల ముందుకు వచ్చి ఆ తర్వాత కనపడకుండా పోయే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు భీమవరం నుంచి పోటీకి సై అంటున్నారు. ఎన్నికల తర్వాత కన్పించని అందనివాడు కావాలా, నిత్యం భీమవరంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే అందరివాడు గ్రంధి శ్రీనివాస్‌ కావాలా?

గ్రంధి శ్రీనివాస్‌..
గ్రంధి శ్రీనివాస్‌ భీమవరంలోనే పుట్టి పెరిగారు. చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరితో కలివిడిగా ఉంటున్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత   నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.

  • భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చారు.
  • పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. 
  • పేదలకు సొంతింటి కల నెరవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించారు.
  • 700 మంది పేదలకు గ్రంధి శ్రీనివాస్‌ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు.
  • యనమదుర్రు డ్రైయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ఓల్డ్‌ యనమదుర్రు డ్రెయిన్‌ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశారు.
  • భీమవరం మండలంలో పేదలకు 1,000 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
  • తోపుడుబండ్ల వర్తకులకు హాకర్లజోన్‌ ఏర్పాటు చేయించారు. 
  • పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశారు. 
  • ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటారు. 
  • గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. 
  • ప్రజలతో మమేకం అవుతారు, 2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్‌ సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు.
  • స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై, తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్కుపై అలుపెరుగని పోరాటం చేశారు. 
  • జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు.
  • 2019లో మళ్లీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర  గ్రంధి శ్రీనివాస్‌ది. 
  • స్థానికుడు కావడంతో నియోజకవర్గ సమస్యలపై అవగాహన

పవన్‌ కళ్యాణ్‌ 
చిరంజీవి పుట్టిన ఊరు మొగల్తూరు. ఇది నరసాపురం నియోజకవర్గంలో ఉంది. కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు నరసాపురంలో పోటీ చేయకుండా పాలకొల్లులో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఈ రెంటికి సంబంధం లేని పక్క నియోజకవర్గం అయిన భీమవరాన్ని ఎంచుకున్నారు. 

  • నాకు కులమతాలే లేవని చెప్పిన పవన్‌ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు?
  • దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఈ జిల్లాలో నుంచున్నానని సెలవిచ్చారు. నిజంగా అదే కారణం అయితే దెందులూరులో నిల్చోవచ్చు కదా?
  • భీమవరంలోనే గెలిచేటట్లైతే గాజువాకలో ఎందుకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై అపనమ్మకమా? అన్న పరాజయం భయపెట్టిందా?   ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్‌ వదిలేస్తారు?ఖచ్చితంగా భీమవరమే.. అనుమానం ఏమైనా ఉందా?..
  • రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది? అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు? పోనీ గెలిచినా.. ఓడినా భీమవరంలో ఉంటారా?
  • ఇంతకుముందు ఏలూరులో ఆఫీసు పెడతానని, ఇక్కడి నుంచే ఓటు నమోదు చేయించుకుని తర్వాత విజయవాడ వెళ్లి అక్కడే ఓటు నమోదు చేయించుకోలేదా?
  • ఏ మాత్రం నిలకడలేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా?
  • రూ. 50 లక్షలు బ్లాక్‌మనీ లేదని మొదటి నుంచి నమ్ముకున్న తనను తప్పించి అవినీతిపరుడైన చిర్రి బాలరాజుకు టిక్కెట్‌ ఇచ్చారంటూ దివ్వెల సృజన ఆవేదన నిజం కాదా?
  • పార్టీలో కీలకమైన బాధ్యతలు చూసే సృజనకే 20 రోజులు ప్రయత్నించినా పవన్‌ కళ్యాణ్‌ కలవలేదు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి?                                                                                        వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో విజ్ఞత గలిగిన ఓటర్‌ ఆలోచించే సమయం వచ్చింది.
మరిన్ని వార్తలు