భీమవరంలో భారీ చోరీ

26 Dec, 2014 01:23 IST|Sakshi

 భీమవరం అర్బన్ : భీమవరంలో మరో భారీ చోరీ జరిగింది. క్రిస్మస్ సందర్భంగా బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లి తిరిగొచ్చేసరికి దొంగలు ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ.4,27,300 నగదు, నగలు అపహరించారు. వన్‌టౌన్ ఎస్సై వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్రహం చాక్‌రాజు పట్టణంలో ఏసీఆర్ సీ ఫుడ్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. స్థానిక కఠారి నగర్‌లోని రెండు పోర్షన్ల డాబా ఇంటిలోని ఒక పోర్షన్‌లో అద్దెకు ఉంటున్నారు. మరో పోర్షన్‌లో ఉంటున్న వారు భద్రాచలం వెళ్లడంతో వారింటికీ తాళం వేసి ఉంది.
 
 కిస్మస్ కావడంతో చాక్‌రాజు బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో చర్చికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చి చూసుకునే సరికి ఇంటి తలుపునకు వేసిన  తాళం లేకపోవడం, తలుపు తెరచి ఉండటాన్ని గమనించారు. వెంటనే లోపలకు వెళ్లి చూసుకునే సరికి బీరువా తెరచి ఉంది. కంగారుగా అందులో ఉన్న కంపెనీకి చెందిన రూ.3,97,300 నగదు, మూడు కాసుల బంగారు తాడు కోసం వెతకగా అవి కనిపించలేదు. దీంతో అవి చోరీకి గురయ్యాయని నిర్ధారించుకుని గురువారం భీమవరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ సీఐ జె.నరసింహమూర్తి ఘటనా ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు.
 
 వరుస దొంగతనాలతో     హడలెత్తిపోతున్న ప్రజలు
 భీమవరం వన్‌టౌన్‌లో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్లలో జరిగే చోరీలతో పాటు చెయిన్ స్నాచింగ్‌లు కూడా ఎక్కువయ్యాయి. స్థానిక గూడూరి ఆంజనేయులు వారి వీధిలో ట్రాక్టర్ మెకానిక్ అల్లాడి శంకర్ వీరవెంకట కృష్ణప్రసాద్ ఇంటిలో దొంగలు పడి తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పార్కు వద్ద నడిచి వెళుతున్న మహిళ నుంచి బంగారు ఆభరణాలు తెంపుకుని పారిపోయారు. గునుపూడిలోని రామాలయంలో ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యిన విషయం తెలిసిందే. ఇలా వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు