సంభ్రమాశ్చర్యం !

14 Aug, 2014 03:19 IST|Sakshi
సంభ్రమాశ్చర్యం !

భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో బయల్పడిన శివలింగం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం
మూడు ఆలయాల అభివృద్ధికి రూ.1.45 కోట్లు మంజూరు
చేబ్రోలు : ప్రాచీన, చారిత్రక ప్రసిద్ధి గాంచిన చేబ్రోలు భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో అతి పురాతన  శివలింగం బయల్పడడం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉత్తర భాగాన తవ్వకాలు జరుపుతుండగా, సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శివలింగం వెలుగు చూసింది.  భీమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు  పైభాగం మాత్రమే కనిపిస్తున్న ఆలయ అభివృద్ధికి  తొలిదశలో తవ్వకాలు ప్రారంభించారు. ఈ ఆలయంతోపాటు ఆదికేశవ స్వామి, నాగేశ్వర స్వామి గాలిగోపురం అభివృద్ధికి రూ. కోటీ 45 లక్షల నిధులు మంజూరయ్యాయి.
     
బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా శివలింగం బయట పడడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పాటు నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం కావటంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలివస్తూనే ఉన్నారు. - తవ్వకాల్లో ఎలాంటి  గుప్తనిధులు లభ్యం కాలేదని పురావస్తు శాఖ అధికారులు వెల్లడిచేశారు. శివలింగం ఇక్కడే ఉంచాలా వేరే చోటకు తరలించాలా అనేది ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయిస్తామని పురావస్తుశాఖ డీఈ తెలిపారు.
ప్రస్తుతం ఆలయం కింద భాగం వరకు సుమారు ఆరు అడుగుల మేర చుట్టూ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆలయం కింద భాగం కూడా కనిపించనుంది.
ఆలయం కింద దక్షిణ భాగంలోని ద్వారం నుంచి మెట్లుపైకి ఎక్కి రెండో అంతస్తులోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకొని ఉత్తరం మెట్లు ద్వారా భక్తులు బయటకు వచ్చే విధంగా పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

 పొన్నూరు ఎమ్మెల్యే పరిశీలన
భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న తవ్వకాలను పొన్నూరు ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ బుధవారం పరిశీలించారు. పనుల వివరాలను పురావస్తు శాఖ, దేవాదాయశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో జోసఫ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
పుకార్లు నమ్మవద్దు ...  భీమేశ్వరస్వామి దేవస్థానం వద్ద నేలమాళిగలు, గుప్తనిధులు బయట పడ్డాయని వస్తున్న కథనాలు, పుకార్లను నమ్మవద్దు. ఎలాంటి గుప్తనిధులు బయటపడలేదు. ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావటానికి చేస్తున్న కృషిలో భాగంగానే తవ్వకాలు చేపట్టారు.
 - కోటేశ్వరన్,పురావస్తుశాఖ డీఈ.

మరిన్ని వార్తలు