సంప్రదాయానికి నిలువెత్తు రూపం

2 Sep, 2019 03:02 IST|Sakshi

ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడే పాండిత్యం ఉన్నప్పటికీ మాతృభాష పట్ల మక్కువతో అతి ఎక్కువగా తెలుగు తప్ప ఇంగ్లిషు పదం రాకుండా జాగ్రత్తపడిన వ్యక్తి వైఎస్‌.

తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి. తెలుగు ప్రాచీన భాష కోసం కృషి చేసి సాధించిపెట్టిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 29 ఏళ్ల యువకుడు, వైద్యవృత్తిని చదివిన వ్యక్తి, మోడరేట్‌ అవకాశాలు మెండుగా ఉండే నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి – రైతాంగానికీ, సాంప్రదాయానికీ బద్ధుడై తెలుగుతనం ఉట్టిపడేవిధంగా పంచెకట్టుతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగు సంస్కృతిక ఉద్దీపకుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం గొప్పది. తన జిల్లాలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి మహాకవులతో ఆయనకు ఎనలేని సాన్నిహిత్యం ఉంది. గజ్జెల మల్లారెడ్డి లాంటి గొప్ప విమర్శకులు, తెలుగుతనాన్ని ఇష్టపడే అనేకమంది తాత్వికులతో సంబంధాలను అత్యంత చనువుగా నెరిపారు.

ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే పాండిత్యం ఉన్నప్పటికీ మాతృభాష పట్ల మక్కువతో అతి ఎక్కువగా తెలుగు తప్ప ఇంగ్లీషు పదం రాకుండా జాగ్రత్తపడిన వ్యక్తి వైఎస్‌. పాత తెలుగు పాటలు, ఆ పాటల్లో ఉన్న సాహిత్యం కోసం చెవులు కోసుకునేవారు. ఆయన కారులో కొన్ని వేల సార్లు ప్రయాణించిన వ్యక్తిని నేను. అలా ఆ అద్భుతమైన పాటలను ఆస్వాదించే అదృష్టం నాకు కలిగింది. అన్నమయ్య 600వ జయంతిని అత్యంత వైభవంగా తాళ్లపాకలో నడిపించిన సైన్యాధ్యక్షుడు వైఎస్‌. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలకు దీటుగా తెలుగు సంస్కృతి, సాహితీ ఉత్సవాలను నిర్వహించటానికి ఆయన కృషి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర గేయాన్ని రాసిన శంకరంబాడి సుందరాచారి, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి విగ్రహాలను స్థాపించింది వైఎస్‌. తిరుపతి ముఖద్వారంలో పూర్ణకుంభం ఏర్పాటు చేసి దానికి పూర్ణకుంభం కూడలిగా నామకరణం చేశారు. అదే విధంగా తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసిన మహామనీనిషి రాజశేఖర రెడ్డి.
-భూమన కరుణాకర రెడ్డి

తెలుగు స్వాభిమానపు కట్టు
నేను 1978లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్యాంటు షర్ట్‌ వేసుకుని వెళ్లాను. ఆ డ్రస్సులో రాజకీయ నాయకుడిగా కనిపించలేదు. పైగా కాలేజీ కుర్రాడిలా ఉన్నానని అంతా అన్నారు. కాస్త పెద్దమనిషిలా కనిపించాలంటే ఏం చేయాలని ఆలోచించాను. పంచె గుర్తొచ్చింది. మొదట నాకు పంచె కట్టింది మా బాబాయి వాళ్లనుకుంటాను. వారం రోజులు ఇబ్బందిగా అనిపించినా ఆ తరువాత అలవాటైపోయింది. పంచెకట్టులో హుందాగా ఉన్నానని మా వాళ్లంతా అన్నారు. అప్పట్లో ఎన్నికలప్పుడు పంచె కట్టాను. అప్పటినుంచీ పంచెకట్టు వదల్లేదు. ఇందులో సంప్రదాయం, సంస్కృతి, రైతు పౌరుషం, తెలుగు స్వాభిమానం ఉన్నాయి. ఈ డ్రస్‌లో రైతుల దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్లు రైతులు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే భావన వారికిగానీ, నాకుగానీ ఏ కోశానా కలుగదు.
(తన పంచెకట్టు గురించి వైఎస్‌) 

మరిన్ని వార్తలు