బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది

18 Jul, 2020 16:48 IST|Sakshi

వరవరరావు విడుదల కోరుతూ ఉప రాష్ట్రపతికి భూమన లేఖ

సాక్షి, తిరుపతి : ముంబైలోని తలోజా జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. అనారోగ్య సమస్యతో పాటు, ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిపడిన వరవరరావు విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. శరీరం మంచాన కట్టుబడి 81  ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. (ఆయన ప్రాణాలు కాపాడాలి)

‘వృద్య శల్యం శరీరంలో ఉన్న వరరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నా. వరవరరావు నిర్బంధం, అనారోగ్యము గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనలు అంకుర్బావ దశలో నాకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్‌రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు వరవరరావు మన సహచరుడు. సహచర్యం, భావాజాలం కాదు, కానీ జైల్లో కలసి ఉన్నాం. రాజకీయ సిద్ధాంతాల్లోను జనక్షేమంకై నడిచే మార్గాల్లో ఎవరి భావాలు వారివి. కానీ మనం మనుషులం. మానవతా దృక్పధంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. (వరవరరావుకు కరోనా పాజిటివ్‌)

కాగా ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్‌ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్‌ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు