ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రతి సమస్యా పరిష్కరిస్తా

28 Jan, 2019 11:53 IST|Sakshi
తిరుమల స్థానికుల సమస్యలు వింటున్న భూమన కరుణాకరరెడ్డి

తిరుమల స్థానికుల సమస్యలపై భూమనకరుణాకరరెడ్డి హామీ

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ‘నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్న ఐదేళ్లు తిరుమలలో మీ జోలికి ఎవరైనా వచ్చారా? ఆ సమయంలో ఇళ్లు, షాపులు కొట్టాలంటూ మీ జోలికి వచ్చిన వారు కూడా లేరు. ప్రమాణం చేసి చెబుతున్నా... అధికారంలోకి వచ్చాక 70 అంతకంటే ఎక్కువ ప్రతిపాదనలతో వచ్చినా నెల రోజులలోపే పరిష్కరిస్తా’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుమలలో నాలుగైదు తరాలుగా వ్యాపారం చేసుకుంటున్న స్థానికులు, భక్తుల సౌకర్యార్థం టీటీడీ మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నాలుగు మాఢ వీధులు, రోడ్లు వెడల్పు చేసేందుకు తిరుమలలో స్థానికంగా ఉన్న వారు నివాసాలు, షాపులను టీటీడీకి స్వాధీనం చేశారు.

వీరంతా తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను తిరుమల స్థానికుల సంక్షేమ సంఘం నేత్వత్వంలో ఆదివారం భూమన కరుణాకరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతికి తరలించిన వారికి జీవనోపాధి కల్పిస్తామని గత పాలకులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 450 మందికి హాకర్స్‌ లైసెన్స్‌లు ఇస్తామని హామీ ఇచ్చారంటూ భూమన దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ అధికారులు సమస్యలను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా అధికార పార్టీ కార్యకర్తలవి మాత్రం పరిష్కరించడం ఎంతవరకు న్యాయమని టీటీడీపై మండిపడ్డారు. దీనిపై భూమన కరుణా కరరెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, స్థానికులతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కార చర్యలపై వారితో సుదర్ఘీంగా చర్చించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తాను చైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో కానిస్టేబుల్‌ కూడా మీ జోలికి వచ్చారా? అని ప్రశ్నించారు. తిరుమలలో షాపులు కాలిపోయి నష్టపోయిన వారికి 20 రోజులు తిరక్కుండానే దుకాణాలు తిరిగి నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరుమలలోని స్థానికుల ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని భూమన కరుణాకరరెడ్డి దేవునిమీద ప్రమాణం చేయటం గమనార్హం. కరుణాకరరెడ్డిని కలిసిన వారిలో తిరుమల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిరిగిరి జయకృష్ణ, గౌరవాధ్యక్షుడు మన్యం మునిరెడ్డి, కెఎం.సత్యనారాయణ, బీసీ రాయల్, జీవీ కుమార్, శరత్‌యాదవ్, శంకర్, దాలం రమేష్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు