ప్రమాదం ముసుగులో భూమయ్య హత్య

10 Feb, 2014 04:05 IST|Sakshi

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తున్న ఆకుల భూమయ్యపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం టిప్పర్ ముసుగులో ఆయనను హత్య చేయించిందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. వేదకుమార్ విమర్శించారు. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన భూమయ్య, కుసుంబ గంగాధర్‌ల సంస్మరణ సభ ఆదివారం హన్మకొండలోని టీఎన్జీఓఎస్ భవన్‌లో తెలంగాణ రైతాంగ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి రాజు అధ్యక్షతన జరిగింది. సభ ప్రారంభానికి ముందు ములుగురోడ్డు నుంచి టీఎన్జీఓఎస్ భవన్‌కు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ఆకుల భూమయ్య మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సభలో టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ మాట్లాడుతూ భూమయ్య హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి అనునిత్యం పోరాడిన భూమయ్యను హత్య చేయించడాన్ని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ సహజ వనరుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విరసం నేత ఎంఏ బాసిత్, జనగాం కుమారస్వామి, మెంచు రమేష్, బాసిరెడ్డి చంద్రశేఖర్, కూనూరు రంజిత్, రాకేష్, బాలరాజ్, గౌస్, రవి, భారతి, ఐత అనిత, నల్లెల్ల రాజయ్య, బి సుధాకర్, కళ, సుద్దాల నాగరాజు, పద్మలత, నర్సాగౌడ్, బంటు శ్రీను, అమరవీరుల బందువులు తదితరులు పాల్గొన్నారు.
 
ఆంక్షలు లేని తెలంగాణకై 11న బంద్..

 
కేంద్ర ప్రభుత్వం 32 ఆంక్షలతో తెలంగాణ పునర్వవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ ఈ నెల 11న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ తెలిపారు. ద్రోహపూరితమైన అంశాలను సవరించి 12న జరిగే రాజ్యసభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 11న తలపెట్టిన బంద్‌లో తెలంగాణవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, మేధావులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు