నేడు భూమిపూజ

6 Jun, 2015 02:50 IST|Sakshi
నేడు భూమిపూజ

సాక్షి గుంటూరు/తుళ్ళూరు : నూతన రాజధాని నిర్మాణానికి మరికొద్ది గంటల్లో భూమిపూజ జరగనుంది. శనివారం ఉదయం సరిగ్గా 8.49 గంటలకు భూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తుళ్ళూరు మండలం మందడం-తాళ్ళాయపాలెం గ్రామాల మధ్య బెజవాడ సత్యన్నారాయణకు చెందిన మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వేనంబర్‌లోని స్థలంలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించనున్నారు. పూజలు, యాగాలతో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

 ఏర్పాట్ల పరిశీలన..
 భూమిపూజ జరిగే ప్రాతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రతా అధికారి జోషి ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్‌డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారయంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామాగ్రిని మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్‌కు అందజేశారు.

 భారీ బందోబస్తు..
 రాజధాని నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ ఫోర్స్, కానిస్టేబుళ్లు కలిపి సుమారు 1,500 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. వారం క్రితమే భూమిపూజ చేయనున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌ల ద్వారా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.

 ప్రత్యేక ఏర్పాట్లు.. : తుళ్ళూరు మండలంలోని మందడం నుంచి తాళ్ళాయపాలెం వెళ్లే రోడ్డులో భూమిపూజ జరగనున్న ప్రాంతానికి ఎదురుగా ఎడమచేతివైపున హెలిప్యాడ్ నిర్మించారు. భూమిపూజ జరగనున్న ప్రాంతంలో వేదపండితులు హోమాలు చేస్తున్న సమయంలో ఐదువందల మంది కూర్చునేలా టెంట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మందడం- తాళ్ళాయపాలెం రోడ్డుకు సమాంతరంగా ఉన్న పొలాలకు వెళ్లే రోడ్డును బాగుచేసి ట్రాఫిక్‌ను అటువైపుకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పక్కనే వీవీఐపీ, వీఐపీ, సామాన్య ప్రజల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సభాప్రాంగణం వద్ద తాడిచెట్లకు పసుపు రంగు వేశారు. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగు సంప్రదాయ పద్ధతిలో ఎడ్ల బండిని సిద్ధం చేశారు.  

 సీఎం పర్యటన ఇలా.. : గుంటూరు ఈస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. శనివారం ఉదయం 8 గంటకలు  ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి వెళతారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి ముఖ్యమంత్రి నూతన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలిస్తారు. 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని విశాఖపట్నం బయలుదేరి వెళతారని ప్రకటనలో పేర్కొన్నారు.

 పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు.. తాడికొండ: భూమిపూజ ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, అనగాని సత్యప్రసాద్ తదిదరులు సందర్శించారు. హెలిప్యాడ్, సభాప్రాంగణం, సీఎం స్వయంగా ట్రాక్టరుతో పొలం దున్నే ప్రాంతాలను పరిశీలించారు. రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌తో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు, ప్రభుత్వం సలహాదారు పరకాల ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు.

 నేడు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం
 సాక్షి, విజయవాడ : నగరంలోని జలవనరులశాఖ ప్రాంగణంలో సిద్ధం చేసిన సీఎం క్యాంపు కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజధానికి ముఖ్యమంత్రి భూమి పూజచేయనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకేృవైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిరసన దీక్ష చేశారని మంత్రి ఉమా ఆరోపించారు.

 పూర్తికాని భవనం .. సీఎం క్యాంపు కార్యాలయం పూర్తిగా సిద్ధమయ్యేందుకు మరో మూడునెలలు పడుతుందని సమాచారం. ముహూర్తం బాగుండటంతో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో అధికారులు హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు