నిరుద్యోగులకు ‘విభజన’ షాక్!

13 Aug, 2013 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ జూలై నుంచే చర్యలు చేపట్టినా విభజన నేపథ్యంలో అవన్నీ ఆగిపోయాయి. నోటిఫికేషన్ల జారీపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని, రెండు మూడేళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న తమకు అన్యాయం చేయవద్దని అభ్యర్థులు ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పలుమార్లు కలిశారు.
 
 అయినా సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తమ ఆవేదనను అధికారులకు విన్నవించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్‌ను కలిసి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. నోటిఫికేషన్ల జారీకి తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా అభ్యర్థులతో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని లేఖ రాశామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు  చేపడతామని చైర్మన్ చెప్పినట్లు అభ్యర్థులు తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు