నాడు చెప్పిందే.. నిజమైంది

6 Jul, 2019 10:51 IST|Sakshi
పేదలపై బ్యాంకు రుణాల భారం మోపడంపై 2017 జూలై 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

పట్టణ గృహ నిర్మాణం విషయంలో గతంలో భారీ స్కాం చోటుచేసుకుంది. 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సిమెంట్‌ సబ్సిడీపై వస్తుంది. అటువంటప్పుడు చదరపు అడుగుకు రూ.1100 మించి కాదు. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 ధర పెట్టి అడ్డంగా దోపిడీకి పాల్పడింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.ఆరు లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీనిపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళదాం
– కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, మండపేట(తూర్పుగోదావరి) : ‘అందరికీ ఇళ్లు పథకం’లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్లాటు ధరలను భారీగా పెంచేసి గత ప్రభుత్వం పేదలను దోచుకుంటున్న తీరును రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ఇటుక కట్టుబడి, అన్ని హంగులు ఉన్న ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ.1500 వరకూ ఉంటుంటే.. స్థలం ఉచితం, ఇసుక ఉచితం, సబ్సిడీపై సిమెంట్‌ ఇన్ని వెసులుబాటుల నేపథ్యంలో ‘అందరికీ ఇళ్లు పథకం’ ప్లాటు రూ.1100 మించకూడదు. అయితే గత ప్రభుత్వం ఏకంగా రూ.2200 ధర పెట్టింది. జిల్లాలోని లబ్ధిదారుల నుంచి దాదాపు రూ. 921.2 కోట్లు దోపిడీకి ఎత్తుగడ వేసింది. టెండర్లు ప్రక్రియ పూర్తయిన అనంతరం రెండుసార్లు ధరల్లో మార్పులు చేయడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది.

‘అందరికీ ఇళ్లు’ పథకం ద్వారా రెండు విడతల్లోను జిల్లాకు దాదపుగా 25,952 ప్లాట్లు మంజూరయ్యాయి. కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరానికి 7876, పెద్దాపురం మున్సిపాల్టీకి 2546, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 6276, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో తునికి 5,049 ఫ్లాట్లు మంజూరయ్యాయి. పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని వారిని అడ్డగోలుగా దోచుకునే ఎత్తుగడ వేసింది గత ప్రభుత్వం. కేటగిరి–1లో 300 చదరపు అడుగుల సింగిల్‌ బెడ్‌రూం, కేటగిరి–2లో 365 చ.అ. సింగిల్‌ బెడ్‌ రూం, కేటగిరి–3లో 430 చ.అ. డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్లుగా విభజించింది. మొదటి కేటగిరి ఫ్లాటు ధర రూ.5.77 లక్షలు, రెండో కేటగిరి ప్లాటు ధర రూ.6.9 లక్షలు, మూడో కేటగిరి ఫ్లాటు ధర రూ.7.93 లక్షలుగా నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయం రూ.3 లక్షలుపోను, మొదటి కేటగిరి లబ్ధిదారులు వాటా రూ. 500, బ్యాంకు రుణం రూ.2.76 లక్షలు చెల్లించాలి. అలాగే రెండో కేటగిరి లబ్ధిదారులు వాటాగా రూ. 50,000, బ్యాంకు రుణం రూ. 3.4 లక్షలు, మూడో కేటగిరి లబ్ధిదారులు వాటాగా రూ.1,00,000, బ్యాంకు రుణం రూ.3.93 లక్షలు చెల్లించాలి. 

అడ్డగోలుగా దోపిడీ
జిల్లాలోని నగర, పురపాలక సంస్థల్లో రియల్టర్లు భూములు కొనుగోలు చేసి, ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, ఐరెన్‌లకు పూర్తిగా నగదు చెల్లించి బాల్కనీ, లిఫ్ట్, నాణ్యమైన కలప, టైల్స్‌ తదితర వసతులతో చేసిన ప్లాటు చదరపు అడుగు ధర రూ. 1300 నుంచి రూ.1500లు వరకు ఉంటున్నాయి. ప్రభుత్వ స్థలంలో ఉచితంగా వచ్చిన ఇసుక, సబ్సిడీపై వచ్చిన సిమెంట్, ఐరెన్‌తో చేసిన అందరికీ ఇళ్లు ఫ్లాట్లలో చదరపు అడుగు రూ.1100లోపే ఉండాలి. అయితే గత ప్రభుత్వం దాదాపు రూ. 2,200లు వరకు ధర నిర్ణయించడం భారీ స్కాం చేసేందుకు స్కెచ్‌ వేసిన విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్కనీ 74,010 ఫ్లాట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలున్నాయి. తాగునీటి అవసరాలకు, గృహవసరాలకు వేర్వేరుగా పైప్‌లైన్లు ఉండాల్సి ఉండగా వీటిల్లో అన్ని అవసరాలకు ఒకటే పైప్‌లైన్‌ పెట్టారన్న విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు అపార్ట్‌మెంట్‌పై ట్యాంకును శుభ్రం చేసుకోకపోతే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పేదలపై రూ. 921.2 కోట్ల అదనపు భారం 
కేటగిరీ–1లో 9,288 మంది, కేటగిరీ–2లో 1993, కేటిగిరీ–3లో 11,304 ఫ్లాట్లు కోసం వచ్చిన దరఖాస్తుల మేరకు లబ్ధిదారుల నుంచి వాటా సొమ్ములు వసూలు చేయడంతోపాటు బ్యాంకుల నుంచి వారి పేరిట రుణాలు తీసుకునే ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించింది. తద్వారా ఇప్పటికే భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా కేటగిరీల్లోని లబ్ధిదారులపై రూ. 921.2 కోట్లు అదనపు భారం మోపినట్టు అంచనా.  

టెండర్లు పిలిచిన తర్వాత ధర తగ్గింపు 
సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ధర తగ్గించడం జరగదు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో బ్యాంకు నుంచి తీసుకునే రుణాలను స్వల్పంగా తగ్గిస్తూ గత ప్రభుత్వం రెండు పర్యాయాలు మార్పులు చేయడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

పేదలను దోచుకోవడమే
అందరికీ ఇళ్లు పథకంలో చంద్రబాబు సర్కారు కోట్లాది రూపాయల పేదల కష్టార్జితాన్ని అడ్డగోలుగా దోచుకుంది.  కామన్‌సైట్, టేకు కలప వినియోగించి చేసిన తలుపులు, కిటికీలు, అధునాతన టైల్స్, విద్యుత్‌ సదుపాయాలతో నిర్మించే ప్రైవేటు ఆపార్ట్‌మెంట్లలోనే ఇంత ధర లేదు. దుస్తులు ఆరబెట్టుకునేందుకు కనీసం బాల్కానీ, లిప్ట్‌ సదుపాయం కూడా లేకుండా నాసిరకంగా నిర్మించిన అందరికి ఇళ్లు ప్లాట్లులో మాత్రం చ.అ రూ. 2200 ధర నిర్ణయించింది పేదలను మోసం చేసింది. 
– రెడ్డి రాధాకష్ణ, మున్సిపల్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మండపేట.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా