దేశంలోనే అతిపెద్ద గోల్‌ గుమ్మజ్‌ !

24 Mar, 2020 11:57 IST|Sakshi

కర్నూలు కల్చరల్‌: కర్నూలు నగరంలోని గోల్‌ గుమ్మజ్‌  ఒక ముఖ్యమైన పురాతన కట్టడం. నగరంలోని హంద్రీ నది ఒడ్డున ఉస్మానియా కళాశాల పక్కన గల గోల్‌ గుమ్మజ్‌ నిర్మాణం అందరినీ అబ్బుర పరుస్తుంది. ఇది దేశంలో కెల్లా అతి పెద్ద గోల్‌ గుమ్మజ్‌గా పేరు గాంచింది. అగ్రాలోని తాజ్‌మహల్, బీజాపూర్‌లోని గోల్‌ గుమ్మజ్‌లను పరిశీలించినా అంత పెద్దగా లేనట్లు తెలుస్తుంది. దీన్ని నిర్మించి 400 సంవత్సరాలు కావస్తున్నా గుమ్మజ్‌ చెక్కుచెదరలేదు.

రాయిరాయి అమర్చి అతిపెద్ద గోల్‌ గుమ్మజ్‌ నిర్మించడం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యతకు అద్దం పడుతుంది. ఈ గుమ్మజ్‌ను 388 సంవత్సరాల క్రితం మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆయన పాలనలో జిల్లా గవర్నర్‌గా ఉన్న అబ్దుల్‌ వహబ్‌ సాహెబ్‌ తన గురువు సయ్యద్‌ కరీముల్లా ఖాద్రీ కోరిక మేరకు దీన్ని నిర్మించినట్లు ముస్లిం పెద్దలు చెబుతుంటారు. 1958వ సంవత్సరంలో పురావస్తు శాఖ  స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు