బిజిలీ బంద్‌ విజయవంతం

25 Apr, 2018 11:35 IST|Sakshi
చోడవరం కొత్తూరు జంక్షన్‌ వద్ద నిరసన తెలుపుతున్న అఖిలపక్షాలు

చోడవరం : ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షాలు బిజిలీ బంద్‌ను నిర్వహించాయి. మంగళవారం రాత్రి దుకాణాలు, ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పేసి అంతా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ రోజును టీడీపీ, బీజేపీలు ప్రజలను   నయవంచన చేసిన దినంగా అఖిల పక్షాలు బిజిలీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో భాగంగా రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు చోడవరం పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, కిరాణా, వస్త్ర, కిల్లీ దుకాణాలు, ఇళ్లల్లో సైతం లైట్లు బంద్‌ చేశారు.

అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంగా ఈ బిజిలీ బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా కావాలని మద్దతు పలికాయి. íసీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీల నాయకులు తమ పార్టీల జెండాలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొత్తూరు జంక్షన్‌ వద్ద ముక్తకంఠంతో బీజేపీ, టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రాష్ట్ర ప్రజలను మోసంచేశారని సీపీఐ డివిజన్‌ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, íసీపీఎం జిల్లా నాయకుడు నాగిరెడ్డి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పట్టణ యూత్‌ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ, జనసేన నాయకుడు జెర్రిపోతుల రమణాజీ ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారని  అన్నారు.

ఈ బిజిలీ బంద్‌లో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో సీపీఐ నాయకులు నేమాల హరి, చిరికి కొండబాబు, నేమాల నర్సింగరావు, ఆబోతు శ్రీనువాసరావు, బొర్రా కనకరాజు, వైఎస్సార్‌సీపీ మండల యూత్‌ అధ్యక్షుడు బలిరెడ్డి హరీష్, పట్టణ రైతు విభాగం ప్రతినిధి లెక్కల వెంకట్రావు, జనసేన నాయకులు నాని, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు