డోలీలకు చెక్‌ పడేనా ..!

11 Mar, 2018 13:03 IST|Sakshi
బైక్‌ అంబులెన్స్‌ , డోలీలో రోగిని తీసుకువస్తున్న దృశ్యం (ఫైల్‌)

గిరిశిఖర గ్రామాలకు బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌లు

పశ్చిమగోదావరిలో విజయవంతమైన ప్రాజెక్ట్‌

జిల్లాలో అమలు చేయాలంటున్న గిరి పుత్రులు

కురుపాం: రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు బైక్‌ అంబులెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గిరిజనుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా డోలీల ద్వారా మైదాన ప్రాంతాలకు వచ్చి వైద్యసేవలు పొందేవారు. ఇకపై అలాంటి కష్టాలు ఉండకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. రహదారులున్న గ్రామాలకు 108 వాహనం ద్వారా సేవలందిస్తుండగా,  వాహనం వెళ్లలేని గ్రామాలకు బైక్‌ అంబులెన్స్‌ ద్వారా సేవలందించాలని అధికారులు, పాలకులు నిర్ణయించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి  జిల్లా బుట్టాయిగూడెం పరిధిలో బైక్‌ అంబులెన్స్‌ సేవలు అమలు చేయగా, సత్ఫలితాలు వచ్చాయి. జిల్లాలో కూడా ఇటువంటి సేవలు అందించాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఇక జిల్లా విషయానికొస్తే అధికారుల కృషి వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. అయినప్పటికీ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ గిరిజన మండలాల్లో సుమారు 300 గిరిజన గూడలకు నేటికీ రహదారి సౌకర్యం లేదు. ఇటువంటి గ్రామాలకు బైక్‌  అంబులెన్స్‌ ద్వారా సేవలందిస్తే ఎన్నో అకాలమరణాలను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

అనారోగ్యం సోకితే అంతే..
ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల్లో ఎవరికి అనారోగ్యం సోకినా అంతే సంగతి. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు సకాలంలో వైద్యసేవలందక ఎంతోమంది మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఆయా గ్రామాలకు 108 వాహనం వెళ్లలేకపోవడంతో నలుగురు మనుషులు డోలీ కట్టి రోగిని అందులో కూర్చోబెట్టి మైదా న ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. సకాలంలో ఆస్పత్రికి రాకపోతే ఇక అంతే సంగతి. ఇటువంటి గ్రామాలకు బైక్‌ అంబు లెన్స్‌ సౌకర్యం కల్పిస్తే సుదూర ప్రాంతాల వారికి సకాలంలో వైద్యసేవలు అందుతాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి త్వరితగతిన ఏజెన్సీ ప్రాంతంలో బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందించాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. రహదారి లేని గ్రామాలకు అంబులెన్స్‌ సకాలంలో చేరుకుని వైద్యసేవలు అందిస్తుంది.
– ఆరిక గయామి, తిత్తిరి ఎంపీటీసీ సభ్యురాలు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు