బైకిల్ రేసింగ్..!

10 May, 2015 04:48 IST|Sakshi

హైదరాబాద్- బెంగళూరు రోడ్డుపై బైక్ రేసింగ్
ఖరీదైన ద్విచక్ర వాహనాల వినియోగం
లక్షల రూపాయల్లో బెట్టింగ్
బెట్టింగ్‌రాయుళ్లంతా బడా బాబుల కుమారులే!
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
తాజా రోడ్డు ప్రమాదమూ ఇందులో భాగమేనా?

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు : హైదరాబాద్-బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారిపై బైక్ రేసింగులు జరుగుతున్నాయా? లక్షల రూపాయల బెట్టింగులు నడుస్తున్నాయా? ఖరీదైన మోటార్ సైకిళ్లపై ప్రతీ వారాంతంలో ఈ రేసులు జరుగుతున్నాయా? వరుసగా జరుగుతున్న వివిధ రోడ్డు ప్రమాదాలకూ ఇది కూడా కారణమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఈ బైక్ రేసుల్లో ప్రధానంగా బడాబాబుల పిల్లలే పాల్గొంటున్నట్టు సమాచారం.

తాజాగా జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లలోనూ బైక్ రేసింగులే కారణమని తెలుస్తోంది. ఇందులో అధికార పార్టీ రాజకీయ నేతల కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కర్నూలును కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ బైకు రేసులపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

వీకెండ్‌లో జోరు...!
 ప్రధానంగా ఈ బైకు రేసులన్నీ శుక్ర, శని, ఆదివారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ రేసులు జరుగుతున్నాయి. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కూ ఈ రేసులు నడుస్తున్నాయి. ఒక బ్యాచ్‌లో హైదరాబాద్‌లో బయలుదేరితే...మరో బ్యాచ్ బెంగళూరు నుంచి బయలుదేరుతోంది. పందెంలో పాల్గొనేవారు పగలు పాల్గొంటారా? రాత్రి సమయాల్లోనా అనే విషయాన్ని నిర్వాహకులకు ముందుగానే తెలపాల్సి ఉంటుంది.

పందెంలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు రూ.10 వేల మేరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. పగటి పూట పందెంలో గెలిచిన వారికి పది రెట్లు అంటే... లక్ష రూపాయల బహుమానం ఇస్తారు. అదే రాత్రి సమయాల్లో అయితే రెండు లక్షల రూపాయల బహుమానాన్ని నిర్వాహకులు ఇస్తున్నట్టు సమాచారం. అయితే, ఇందులో పాల్గొనే వారందరూ ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.   

ఖరీదైన వాహనాలు....!
 ఈ రేసింగులో పాల్గొంటున్న వారు ఖరీదైన వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రధానంగా హార్లిడేవిడ్ సన్ వంటి స్పోర్ట్స్ బైకులను వీరు వాడుతున్నారు. అంతేకాకుండా బైక్ రేసింగు కోసం ప్రత్యేకమైన దుస్తులతో పాటు హెల్మెట్....కాళ్లకు స్పోర్ట్స్ షూస్, ప్రయాణంలో అవసరమయ్యే సామగ్రిని కూడా తమతో ఉంచుకుంటున్నారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వాడిన బైకు ఖరీదు రూ.18 లక్షల ఖరీదు అని....హెల్మెట్ ఖరీదు 50 వేల రూపాయలని సమాచారం.

అయితే, ఈ రేసులల్లో పాల్గొంటున్నవారందరూ బడా బాబుల కుమారులే కావడం గమనార్హం. అందుకే ఇంతగా రేసింగ్‌లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ బైకుతో పాటు రేసింగులో పాల్గొన్న ఇతర అధికార పార్టీ నేతల కుమారులను పోలీసులు పకడ్బందీగా తప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అందరూ బడా బాబులే...!
 ఈ రేసింగులో పాల్గొంటున్న వారందరూ రాజకీయ పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల కుమారులే అధికంగా ఉంటున్నారు. వీరందరూ కేవలం రేసింగుపై మోజుతోనే ఇందులో పాల్గొంటున్నారు. బెట్టింగ్‌లో వచ్చే లక్ష, రెండు లక్షల రూపాయలను ఇటు హైదరాబాద్ గమ్యస్థానం చేరితే అక్కడ... లేదా బెంగళూరులో వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ బైకు రేసింగులపై దృష్టి సారించకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం రేసింగులో పాల్గొంటున్న వారే కాకుండా.. రోడ్డుపై వెళుతున్న సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ బైకు రేసింగులను కట్టడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు