జననేతకు మద్దతుగా భారీ బైక్‌ ర్యాలీ

30 Sep, 2018 06:34 IST|Sakshi

వాహనం నడిపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ కోలగట్ల 

నేడు, రేపు విజయనగరంలో ప్రజా సంకల్ప యాత్ర  

విజయనగరం రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం నియోజకవర్గంలో ఆది, సోమవారాల్లో చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోలగట్ల నివాసం వద్ద బైక్‌ ర్యాలీని స్వయంగా ఆయనే బైక్‌ నడిపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆది, సోమవారాల్లో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ పరిధిలో జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సాగుతుందన్నారు. సోమవారం సాయంత్రం శ్రీపైడితల్లి అమ్మవారి ఆలయ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని ప్రజలంతా హాజరై  విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 సభతో తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ప్రజా కంటక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పాలన ప్రజలను అన్ని విధాల ఇబ్బందుల పాల్జేస్తోందన్నారు. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టించారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా బైక్‌ ర్యాలీ రింగు రోడ్డు మీదుగా దాసన్నపేట రైతుబజారు, గుమ్చి, మూడు లాంతర్లు, గంటస్తంభం, వెంకటలక్ష్మి థియేటర్‌ జంక్షన్, కంటోన్మెంట్, కలెక్టరేట్, ఆర్‌అండ్‌బీ, ఎత్తు బ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా, బాలాజీ జంక్షన్, జొన్నగుడ్డి నుంచి కోలగట్ల నివాసానికి చేరుకుంది. బైక్‌ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

జగన్‌ను కలిసిన కోలగట్ల
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కలిశారు. శనివారం సాయంత్రం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలోని జామి మండలంలో గల పాతభీమసింగి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో కోలగట్ల జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆదివారం నుంచి విజయనగరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా పాదయాత్ర అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన చర్చించారు. 

మరిన్ని వార్తలు