బైక్‌ దొంగలముఠా గుట్టురట్టు..

14 Jan, 2019 14:09 IST|Sakshi
బైక్‌ల దొంగతనం చేసిన ముగ్గురు నిందితులు

13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న బొబ్బిలి పోలీసులు

మెరకముడిదాం : తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు బైక్‌ల దొంగతనాలను చేసే ముఠా గుట్టురట్టైంది. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన మెరకముడిదాంనకు చెందిన గొలుసు లక్ష్మణ ఇటీవల విజయనగరం వెళ్లాడు.   అక్కడ తన పల్సర్‌ బైక్‌ పార్క్‌చేసి పనులు చూసుకుని తిరిగి వచ్చేసరికి బైక్‌ కనిపించలేదు. చుట్టుపక్క ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో వెంటనే  విజయనగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వచ్చేశాడు. అయితే మెరకముడిదాంలోని ఒక న్యూడిల్‌ షాపు వద్ద  గొలుసు లక్ష్మణకు చెందిన బైక్‌ ఆదివారం కనిపించడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు లక్ష్మణ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో లక్ష్మణ కుటుంబ సబ్యులు, గ్రామానికి చెందిన కొందరు యువకులు కలిసి బైక్‌ ఉన్న ప్రదేశానికి చేరుకుని బైక్‌ ఎవరు తీసుకువచ్చారో తెలుసుకునేందుకు చుట్టుపక్కల కాసికాశారు. ఇంతలో మెరకముడిదాం మండలం గోపన్నవలస గ్రామానికి చెందిన బోగాది లక్ష్మణరావు, కందికుప్ప రవి, గురాన ఈశు అనే ముగ్గురు యువకులు బైక్‌ తీస్తుండగా చుట్టుపక్కల కాపుకాసి ఉన్న మెరకముడిదాం వాసులు పట్టుకున్నారు.

ఈ బైక్‌ మాదని..మీకు ఎలా వచ్చిందని ముగ్గురు యువకులను లక్ష్మణరావు కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో నిందితులు ఈ బైక్‌ తమదని మొదట బుకాయించారు. గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో నిందితులు ఓ గ్రామపెద్దకు ఫోన్‌ చేసి తమ బైక్‌ను కొంతమంది అడ్డుకున్నారని తెలియజేశారు. దీంతో ఇరువర్గాలను ఆ పెద్దాయన (సోమలింగాపురం వ్యక్తి) రమ్మని చెప్పడంతో పాటు నిందితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిందితుల తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను గట్టిగా నిలదీయడంతో తాము చాలాకాలంగా బైక్‌లు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు యువకులు చీపురుపల్లి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న బొబ్బిలి పోలీసులు సోమలింగాపురం చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకుని ఎక్కడెక్కడ బైక్‌లు దొంగతనం చేశారు.. ఎవరెవరికి విక్రయించారన్న కోణంలో విచారించారు. దీంతో 13 బైక్‌లు దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు ఆ బైక్‌లు ఎవరెవరికి విక్రయించారో కూడా పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు బైక్‌లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఫోన్‌లు చేసి సోమలింగాపురం రప్పించారు. వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని బొబ్బిలి తరలించారు. అయితే ఈ ముగ్గురు వెనక పెద్దముఠాయే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ జరిగితే నిందితుల వెనుకున్న ముఠా బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపడుతున్నట్లు సీఐ మోహనరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు