రాత్రిళ్లు హైవేలపై బైక్‌ ప్రయాణం నిషేధం

28 Dec, 2018 13:34 IST|Sakshi

రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు బైక్‌ ప్రయాణంపై నిషేధం అమలు

జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్‌ ఆదేశాలు

గుంటూరు వెస్ట్‌: రాత్రిళ్లు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్‌ కోన శశిధర్‌ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవరసరంగా ప్రయాణించాల్సి వస్తే బస్సు, మరేదైనా పెద్ద వాహనంలో వెళ్లాలని సూచించారు.

అవసరం కంటే ప్రాణం విలువైనదన్నారు. ట్రక్కులు, ట్రాక్టర్ల వల్ల కూడా ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయని, వారు రాత్రిళ్లు ప్రయాణించేటప్పుడు వెనుక రేడియం స్టిక్కర్లు వేయించుకోవాలన్నారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి  మరణిస్తే అతడిపై ఆధారపడే కుటుంబం గురించి ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జాతీయ రహదారులు, ఆర్టీఓ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో అర్బన్, రూరల్‌ ఎస్పీలు విజయరావు, రాజశేఖరబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు