ప్రజలంటే అలుసే..!

25 May, 2018 12:41 IST|Sakshi
పొదిలిలోని బాప్టిస్ట్‌పాలెంలో ట్యాంకర్‌ వద్ద..

ఏడాదిగా తాగునీటి బిల్లులు చెల్లించని సర్కార్‌

తాగునీటి ట్యాంకర్లకు నిలిచిన రూ. 60.92 కోట్ల బకాయిలు

ఆందోళనలో సర్పంచ్‌లు, ట్యాంకర్ల యజమానులు

నీళ్లందక ప్రజల ఇక్కట్లు ఈ ఏడాది సరఫరాకు ఒప్పుకోనంటున్న వైనం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  నిధుల కొరతలేదని తాగునీటి అవసరాల కోసం ఎన్ని కోట్లైనా ఇస్తామని చెప్పిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ మాటలు నీటిమూటలుగా మారాయి. ప్రభుత్వం సకాలంలో నిధుల్వివక పోవడంతో గ్రామపంచాయతీల్లో  తాగునీటి సరఫరా సక్రమంగా సాగడంలేదు. 13 నెలలకు సంబంధించి రూ. 60.92 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. డబ్బులివ్వక పోతే నీటి సరఫరా నిలిపి వేస్తామని సర్పంచ్‌లతో పాటు ట్యాంకర్‌ యజమానులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే కొందరు నీటి తరలింపు నిలిపి వేయడంతో  నీటి కొరత ఉన్న గ్రామాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. 

పగబట్టిన వాతావరణం
తీవ్ర వర్షాభావం వల్ల జిల్లాలో తాగునీటి కష్టాలు పెరిగాయి. చాలా ప్రాంతాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం నీటిసరఫరా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, కందుకూరు, దర్శి తదితర ప్రాంతాల్లోని దాదాపు 700 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటి  బోరుబావులు ఒట్టిపోవడంతో పాటు తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం 400 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టింది. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లు మరికొన్ని గ్రామాల్లో  అధికారపార్టీకి చెందిన స్థానిక నేతలు నీటిని సరఫరా చేశారు.

లక్షలాది ట్రిప్పులు
2017 ఏప్రిల్‌లో 92 వేల ట్రిప్పులు, మేలో 1.23 లక్షలు, జూన్‌లో 1.27 లక్షలు, జులైలో 1.30 లక్షలు, ఆగస్టులో 1.17 లక్షలు, సెప్టెంబర్‌లో 64 వేలు, అక్టోబర్‌లో 40 వేలు, నవంబర్‌లో 24 వేలు, డిసెంబర్‌లో 27 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. వీటికి సంబంధించి రూ. 39.92 కోట్లను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ద్వారా గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సి ఉంది. ఇక 2018 ఏడాదికి సంబధించి జనవరిలో  142 గ్రామాల పరిధిలో రోజుకు 1214 ట్రిప్పుల ప్రకారం నెలకు 36,420 ట్రిప్పులు, ఫిబ్రవరిలో 178 గ్రామాల పరిధిలో నెలకు 47,730, మార్చిలో 247 గ్రామాల పరిధిలో నెలకు 74,760, ఏప్రిల్‌ నెలలో 312 గ్రామాల పరిధిలో నెలకు 99,240,  మే నెలలో 350 గ్రామాల పరిధిలో రోజుకు 3700 లెక్కన నెలకు 1.12 లక్షల ట్రిప్పులను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలకు రూ. 4 కోట్ల చొప్పున   ఖర్చు కాగా మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో రూ. 13 కోట్లు నీటి సరఫరాకు ఖర్చయింది.

ఈ లెక్కన ఈ ఏడాది అయిదు నెలలకు రూ. 21 కోటి అయింది. అంటే మొత్తం 13 నెలల్లో తాగునీటి సరఫరా ఖర్చు రూ. 60.92 కోట్లు. ఈ మొత్తంలో ప్రభుత్వం ఇప్పటికి ఒక్క పైసా చెల్లించలేదు. ఏడాదిగా బిల్లులు రాకపోవడంతో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారింది. పాత బిల్లులు ఇస్తేనే నీరు సరఫరా చేస్తామని పలువురు సర్పంచ్‌లు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో నీటి సరఫరాను నిలిపి వేసినట్లు తెలిసింది. త్వరలోనే బిల్లులు వస్తాయని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం బిల్లులు మంజూరు చేయాలని  సర్పంచ్‌ లు డిమాండ్‌ చేస్తున్నారు.

నిధులు వచ్చాయి
తాగు నీటిసరఫరాకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు రూ. 39.92 కోట్లు బిల్లులు ఇవ్వాలి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సరఫరాకు సంబంధించిన బిల్లులు సైతం ఇవ్వాల్సి ఉంది. గత ఏడాదికి సంబంధించిన రూ. 39.92 కోట్ల నిధులు వచ్చాయి. బిల్లులు తెప్పించుకున్నాం. త్వరలోనే ఈ మొత్తాన్ని చెల్లిస్తాం. ఈ ఏడాది నీటి సరఫరా బిల్లులు తర్వాత ఇస్తాం.
– మహేష్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారి

మరిన్ని వార్తలు