గూడుకు పైసల్లేవ్‌

4 Apr, 2018 09:44 IST|Sakshi

ఎన్టీఆర్‌ గృహాలకు    50 రోజులుగా ఆగిపోయిన బిల్లులు

జిల్లాలో లబ్ధిదారులకు  రూ.34కోట్లు పెండింగ్‌

స్తంభించిన ఇళ్ల నిర్మాణాలు

సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు విడతల వారీగా చెల్లించాల్సిన బిల్లులు ఆగిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులు ఎప్పుడిస్తారో తెలియక లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో బిల్లులు వచ్చే సూచనలు కనిపించడం లేదని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు అటకెక్కినట్టే.

బి.కొత్తకోట: జిల్లాలో 2016–19 ఆర్థిక సంవత్సరానికి 54,010 ఎన్టీఆర్‌ ఇళ్లను గ్రామీణ, పట్టణ పథకాల కింద మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు ఇస్తారు. నిర్మాణం ప్రారంభమయ్యాక సిమెంటు విలువతో కలిపి తొలివిడత రూ.15వేలు, రెండో విడత రూ.25వేలు, మూడో విడత రూ.40వేలు, నాలుగో విడత రూ.12వేలు చొప్పున బిల్లులను లబ్ధిదారుల ఖాతాలకు చెల్లిస్తారు. మిగిలిన రూ.58వేలకు సంబంధించి ఉపాధి పథకం ద్వారా కూలీలు, ఇటుకల కోసం చెల్లిస్తారు. జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

బిల్లొచ్చి 50రోజులైంది..
లబ్ధిదారులకు బిల్లు మంజూరై 50 రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మంగళవారం వరకు అంటే 50 రోజులుగా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. ఫివ్రబరి 12 నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లు కోసం సంబంధిత డీఈ, ఈఈలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. వీటిని పరిశీలించి ఉన్నతాధికారులు తక్షణమే బిల్లులు మంజూరు చేస్తూ చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 2 నాటికి (సోమవారం) అధికారిక లెక్కల ప్రకారం లబ్ధిదారులకు అందాల్సిన బిల్లుల నగదు రూ.34,07,61,940. ఈ మొత్తం చెల్లింపులు ఆగిపోవడంతో పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటిని ఎప్పుడు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అప్పులతో పనులు..
నిర్మాణాలు పూర్తి చేయించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల వెంట పడుతున్నారు. దాంతో బిల్లులు అందకపోయినా అప్పులు చేసి లబ్ధిదారులు పనులు చేయిస్తున్నారు. బిల్లులు వస్తాయన్న ఆశతో రుణాలపై ఆధారపడ్డారు. ఇప్పుడు బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే ఆన్‌లైన్‌లో బిల్లు జనరేట్‌ చేశాం.. వచ్చేస్తుంది.. అన్న సమాధానం ఇస్తున్నారే కాని స్పష్టంగా చెప్పడం లేదు.

అవును బిల్లులు ఆగాయి..
జిల్లాలో ఫిబ్రవరి 12 నుంచి ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. శాఖ ప్రధాన కార్యాలయం నుంచే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతుంది. దీనిపై మాకు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఏమీలేదు.  –ధనుంజయుడు, ప్రాజెక్టు డైరెక్టర్, చిత్తూరు

మరిన్ని వార్తలు