ఇందిరమ్మకు విభజన సెగ

27 May, 2014 00:39 IST|Sakshi

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి తాకింది. ఎన్నికల కోడ్, రాష్ట్ర విభజన ప్రక్రియ కారణంగా మార్చి15 నుంచి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో నిర్మాణాలను పూర్తి చేసుకోలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాకు మంజూరైన 71,032 గృహాల నిర్మాణాలను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. వీటిలో సుమారు 10 వేల ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో, మిగతావి వివిధ దశల్లో కొనసాగుతున్న తరుణంలో మార్చిలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో బిల్లుల చెల్లింపు ఆగిపోయింది. ఫలితంగా సుమారు రూ. 5 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

 కోడ్ ముగిసినా..
 ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేసేందుకు అధికారులు ఉపక్రమించగా ఖజానా శాఖలో శనివారం నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర వాటిని వేర్వేరుగా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాల్సి రావడంతో ఆటంకాలు తప్పలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లుల చెల్లింపు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో కూడా నిర్మాణాలు చివరిదశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వేసవిలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు అప్పుసప్పో చేసి సిద్ధమైన లబ్ధిదారులు కొత్త ప్రభుత్వ నిర ్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు