నెల్లిమర్లలో ‘బయోపార్క్‌’

20 Apr, 2018 07:19 IST|Sakshi
బయోపార్క్‌ ఏర్పాటుకు కేటాయించిన స్థలం

సారిపల్లి సెంట్రల్‌ నర్సరీలో ఏర్పాటుకు సన్నాహాలు

10హెక్లార్ల భూమి కేటాయించిన అటవీశాఖ అధికారులు

వనవిజ్ఞాన కేంద్రం, రాశివనం, యోగాకేంద్రం ఏర్పాటు

రాశివనం, నక్షత్రవనం, ట్రెక్కింగ్‌ ఏర్పాటుకు సన్నాహాలు

మొదటి విడతగా రూ కోటి విడుదల చేసిన ప్రభుత్వం 

చుట్టూ పచ్చదనం పరచుకునే వనాలు... గుబురుగా పెరిగే చెట్లు... ప్రకృతి సిద్ధమైన సౌందర్యం... ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... రకరకాల పక్షుల కిలకిలారావాలు... అందులోనే విహారానికి అనువైన ఏర్పాట్లు... పర్వతారోహకులను ప్రోత్సహించే సౌకర్యాలు... ఇవన్నీ ఒకే చోట ఉంటే అది ఇలలో వెలసిన స్వర్గం అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ప్రాంతాన్నే జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నెల్లిమర్ల ప్రాంతాన్ని అటవీశాఖాధికారులు ఎంపిక చేశారు. ఇదే పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతానికి ఓ గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నెల్లిమర్ల : పచ్చనైన వనం మధ్యన పిల్ల లకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అడవి మధ్యలో ఆటలాడుకునేందుకు పార్కులు, కొండలెక్కేందుకు ట్రెక్కింగ్, సైక్లింగ్‌ ట్రాక్, వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల పరిధిలోని సారిపల్లి సెంట్రల్‌ నర్సరీలో బయోపార్క్‌ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం అటవీశాఖ అధికారులు 10హెక్టార్లు కే టాయించారు. అంతేగాకుండా ఆ పార్కులో వివిధ పనులు చేపట్టేందు కు మొదటి విడతగా ప్రభుత్వం తాజాగా రూ కోటి కేటాయించింది.

నగరవనం స్థానే బయోపార్కు 
అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నగరవనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో నగరాలకు సమీపంలో ఎక్కువ విస్థీర్ణంలో మొక్కలను పెంచాలన్నది దాని లక్ష్యం. అంతేగాకుండా అదే నగరవనంలో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అవసరమయ్యే పార్క్‌లు, ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని పేర్కొంది. విజయనగరంలో మాత్రం ఇంతవరకు నగరవనం ఏర్పాటుకాలేదు. దాని స్థానంలో ‘బయోపార్క్‌’ ఏర్పాటుచేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. 

సారిపల్లి సెంట్రల్‌ నర్సరీలో ఏర్పాట్లు
జిల్లాకు తాజాగా వచ్చిన ఆ శాఖ పీసీసీఎఫ్‌(రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి) ఈ మేరకు బయోపార్క్‌ వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు విజయనగరం–నెల్లిమర్ల ప్రధాన రహదారినుంచి సారిపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న ‘సారిపల్లి సెంట్రల్‌ నర్సరీ’లో బయో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో వనాల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ‘వనవిజ్ఞాన కేంద్రం’ నెలకొల్పుతున్నారు. ఈ కేంద్రంలో వివిధరకాల మొక్కలు, వాటి ప్రాధాన్యతను వివరిస్తారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్‌ పార్క్, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా సెంటర్, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేస్తారు.

సమీపంలోనున్న కొండను ఎక్కేందుకు ట్రెక్కింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. అంతేగాకుండా వివిధరకాల ఔషధ మొక్కలతో రాశివనం, నక్షత్రవనం తదితరాలను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులతో కూడిన క్యాంటీన్, ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పటికే సారిపల్లి సెంట్రల్‌ నర్సరీలో బయోపార్క్‌ పనులు ప్రారంభమయ్యాయి. క్యాంటీన్, వన ఉత్పత్తుల ప్రదర్శనలకు సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తయ్యింది. నక్షత్రవనం, రాశివనాల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 

చురుగ్గా బయోపార్కు పనులు
వనాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు, వనాల్లో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బయోపార్క్‌ ఏర్పాటు చేస్తున్నాం. సారిపల్లి సెంట్రల్‌ నర్సరీలో 10 హెక్టార్లలో పార్క్‌ ఏర్పాటవుతోంది. ఆ పార్క్‌లో వనవిజ్ఞాన కేంద్రం, చిల్డ్రన్స్‌ పా ర్క్, యోగాకేంద్రం, ట్రెక్కింగ్‌ తదితరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతగా మంజూరైన రూ కోటితో ఆ పనులు ప్రస్థుతం చురుగ్గా జరుగుతున్నాయి. 
– గంపా లక్ష్మణ్, డీఎఫ్‌ఓ, విజయనగరం 

మరిన్ని వార్తలు