ఉపాధి కుటీరం!

16 Dec, 2019 13:06 IST|Sakshi
ప్లేట్లు తయారు చేస్తున్న మహిళలు

కుటీర పరిశ్రమతో 12 మందికి ఉపాధి చూపిస్తున్న మాజీసైనికుడు  

విస్తరాకులు, వక్క చెట్ల బెరడుతో ప్లేట్లు, కప్పుల తయారీ  

కోయంబత్తూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ నగరాలకు ఎగుమతి

ప్లాస్టిక్‌ రహితమే లక్ష్యంగా కుటీర పరిశ్రమ స్థాపించివిస్తరాకులు, వక్క చెట్లబెరడులతో బోజనం, టిఫన్‌ ప్లేట్లు, కప్పులు, తయారు చేసి తాను ఉపాధి పొందడమేకాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే షేక్‌ అలీముస్తఫా

కంభం: బయోడీగ్రేడబుల్‌ ఉత్పత్తుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు మాజీ సైనికుడు అలీ ముస్తఫా. కుటీర పరిశ్రమ స్థాపనతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలంలోని కందులాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు షేక్‌ అలీ ముస్తఫా ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే పదవీ విరమణకు ముందు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీ రూరల్‌ టెక్నాలజీ పార్క్‌లో ఉపాధి శిక్షణ పొందారు. రీ ఎంప్లాయ్‌మెంట్‌లో భాగంగా సైన్యంలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణకు ముందు 21 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అందులో ప్లాస్టిక్‌ రహిత వస్తువుల తయారీపై ముస్తఫా శిక్షణ పొందారు. రిటైరైన తర్వాత అసోం, ఒడిశా, హైదరాబాద్‌ నుంచి అవసరమైన మిషనరీని తెప్పించి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామం కందులాపురంలో కుటీర పరిశ్రమ స్థాపించారు. 

పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా..
కుటీర పరిశ్రమలో ప్లాస్టిక్‌ రహిత ప్రసాదం ప్లేట్లు, భోజనం, బిర్యానీ, టిఫిన్, పానీపూరీ, చాట్, టేబుల్‌ ప్లేట్లు, బఫే ప్లేట్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం మాడపాకులు(విస్తరాకులు), కాన్సెషన్‌ పేపర్, బ్రౌన్‌ క్రాఫ్ట్, డీగ్రేడబుల్‌ ఎల్‌డీ పేపర్‌ వినియోగిస్తున్నారు. వక్కచెట్ల బెరడుతో ప్రత్యేకంగా ప్లేట్లు తయారు చేస్తారు. 4 అడుగుల సైజు నుంచి 12 అడుగుల సైజు వరకు ప్లేట్లు ఇక్కడ తయారవుతున్నాయి. అలాగే బ్రిచ్‌ఉడ్‌ స్పూన్స్, ఫోర్కులు, బయో డీగ్రేడబుల్‌ వాటర్‌ గ్లాసులు కూడా తయారు చేస్తున్నారు.   

నెలకు 60 వేల ప్లేట్ల తయారీ
డిమాండ్‌ను బట్టి నెలకు 60 వేల ప్లేట్లు తయారు చేస్తామని అలీ ముస్తఫా తెలిపారు. ప్లేట్ల తయారీ కోసం ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా కోయంబత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పూర్తిగా ప్లాస్టిక్‌ రహితం కావడం, బయోడీగ్రేడబుల్‌ మెటీరియల్‌ వినియోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్లాస్టిక్, డిస్పోజల్‌ ప్లేట్లతో పోల్చితే వీటి ఖరీదులో పెద్దగా వ్యత్యాసం లేదు.

పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ రహిత వస్తువులు  
ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కుటీర పరిశ్రమ కోసం సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టా. కందులాపురంతోపాటు గిద్దలూరులో కూడా ప్లేట్లు తయారీ చేస్తాం. రెండు చోట్లా కలిపి 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నెలలో 24 రోజులు ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తాం. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ రహితంగా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా పంపిస్తున్నా. రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌ నిర్మూలన పూర్తి స్థాయిలో చేపడితే బయోడీగ్రేడబుల్‌ ఉత్పత్తుల వాడకం మన ప్రాంతంలో కూడా పెరిగే అవకాశం ఉంది.  – ఎస్‌కే అలీ ముస్తఫా, మాజీ సైనికుడు

మరిన్ని వార్తలు