వేలిముద్రతో వేతనానికి లింక్‌ !

9 Apr, 2018 07:51 IST|Sakshi
బయోమెట్రిక్‌ వేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలకు బయోమెట్రిక్‌

జిల్లాలో 6,700 మంది కార్యకర్తలు, ఆయాలు

బయోమెట్రిక్‌ మిషన్లు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌  

వత్సవాయి (జగ్గయ్యపేట) :  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ విధానాన్ని ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైన తరువాత వేలిముద్ర వేస్తేనే వేతనం అనే మెలిక  పెట్టనున్నారు. బుధవారం నుంచి ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉన్న బయోమెట్రిక్‌ యంత్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు వేలిముద్ర వేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ విధానం గురించి అంగన్‌వాడీలకు తెలియజేశారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు సమీపంలోని పాఠశాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు ఇప్పటికే వారి కార్యాలయాల్లో వేలిముద్ర వేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ విధానం అమలు చేసిన తరువాత హాజరు నమోదును బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించనున్నారు. 

గ్రేడ్ల విధానం
90 శాతం కంటే హాజరు ఎక్కువగా ఉంటే ఏ గ్రేడ్‌
70 శాతంలోపు బి గ్రేడ్‌
50 శాతం లోపు సీ గ్రేడ్‌గా పరిగణిస్తారుసీ గ్రేడ్‌గా వచ్చిన కేంద్రాల నిర్వాహకులకు ఒకటి, రెండు సార్లు హెచ్చరించి తరువాత వారి జీతాలలో కోత పెడతారు. భవిష్యత్తులో వేతనాల పెంపు. పదోన్నతులు వంటి అంశాలన్నింటికీ ఇది కీలకంగా మారనుంది.

కృష్ణా జిల్లాలో 6,700 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు
కృష్ణా జిల్లాలో చిల్లకల్లు, నందిగామ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు, విజయవాడ, 1, 2, గన్నవరం, ఉయ్యూరు, కంకిపాడు, గుడివాడ, మండవల్లి, కైకలూరు, బంటుమిల్లి, అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, బందరు అర్బన్, బందరు రూరల్‌ ప్రాజెక్టులున్నాయి. వీటిలో 3,350 మంది కార్యకర్తలు, 3,350 మంది ఆయాలు పనిచేస్తున్నారు.

అమలు సాధ్యమయ్యేనా..?
ఈ విధానం అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు అమలు సాధ్యమయ్యేనా అనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ ద్వారా నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్‌ బిజీగా ఉండడంతో వెంటనే వేలిముద్రలు పడక వాటిముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. పది మంది చొప్పున టీచర్లు ఉండే పాఠశాలల్లో బయోమెట్రిక్‌ వేసేందుకే గంటసేపు పడుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇక అంతే సంగతులు. ఇక గ్రామానికి నాలుగు నుంచి ఐదు వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, పెద్ద గ్రామాలైతే పది వరకు ఉన్నాయి. గంటల తరబడి టీచర్లు, ఆయాలు వేలిముద్రలు పడిందాకా అక్కడే ఉంటే ఇక అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులను ఎప్పుడు తీసుకురావాలి, వారి అలనాపాలనా ఎవరూ చూడాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు సుమారు కిలోమీటరుపైనే దూరం ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో అంతదూరం నడిచివెళ్లి బయోమెట్రిక్‌ వేసి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

కేంద్రాల్లోనే బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే బయోమెట్రిక్‌ విధానం పెట్టాలి. ఉదయం, సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వేలిముద్ర వేయాలంటే కష్టం. ప్రభుత్వం అన్ని రకాల సర్వేలను అంగన్‌వాడీలతో చేయించుకుంటూ వారిని పనిదొంగలుగా చూస్తున్నారు. గ్రామాల్లో తనిఖీలకు వచ్చే ప్రతి అధికారి, ప్రజాప్రతిని«ధులు అంగన్‌వాడీ టీచర్లను బెదిరించేవారే. ప్రభుత్వం అంగన్‌వాడీల సేవలను అన్ని విధాలుగా వాడుకుంటూ వారికి వేతనాలు పెంచే విషయంలో మాత్రం పట్టించుకోవడంలేదు.– సుప్రజ, అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి

త్వరలో అమల్లోకి..
అంగన్‌వాడీలు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది. హాజరు శాతాన్ని బట్టి గ్రేడ్లుగా విభజిస్తారు. బయోమెట్రిక్‌ ఆధారంగా వేతనాలు అందిస్తారు. 
– గ్లోరి, ఐసీడీఎస్‌ సీడీపీవో, చిల్లకల్లు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా