ప్రభుత్వాస్పత్రిలో బయోమెట్రిక్

27 Dec, 2014 01:15 IST|Sakshi
ప్రభుత్వాస్పత్రిలో బయోమెట్రిక్

జనవరి రెండో వారం నుంచి అమలు
ఆదేశాలు జారీచేసిన వైద్య విద్య సంచాలకులు
వైద్యులు, సిబ్బంది
ఆలస్యంగా రావడంపై మంత్రి కామినేని సీరియస్

 
లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రిలో జనవరి రెండో వారం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల నుంచి ఆస్పత్రి అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ఏర్పాటుకు సంబంధించి తగిన చర్యలు  తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.

మంత్రి కామినేని సీరియస్..

ప్రభుత్వాస్పత్రిలో వైద్యులతోపాటు నర్సింగ్, ఇతర సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీరియస్‌గా ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన ఉదయం 10.15 గంటలకు పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, అప్పటికి 13 మంది వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయలేదు. వారిలో నగులురు వైద్యులు సెలవులో ఉన్నారు. మంత్రి ఆగ్రహం వ్యక్తంచేయడంతో మిగిలిని 9మంది వైద్యులకు ఆస్పత్రి అధికారులు మెమోలు జారీచేశారు.
 
మూడేళ్ల క్రితమే ఏర్పాటుచేయాలని...

ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించడంలేదని చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. రోగులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన షిఫ్ట్ డ్యూటీ చేసేవారు సైతం గంట ఆలస్యంగా రావడం, నిర్ణీత సమయం కన్నా ముందే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితమే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రశేపెట్టాలని అప్పటి కలెక్టర్ రిజ్వీ భావించారు. ఆయన బదిలీ కావడంతో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మంత్రి జోక్యం చేసుకోవడంతో వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. తద్వారా ఆలస్యంగా విధులకు హాజరయ్యేవారిని దారిలో పెట్టవచ్చని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు