బయోమెట్రిక్‌తో ఆందోళన

2 May, 2016 02:48 IST|Sakshi
బయోమెట్రిక్‌తో ఆందోళన

దుర్గగుడి సిబ్బంది వేతనాల్లో కోత
నెలంతా వచ్చినా 8 రోజులు గైర్హాజరైనట్లు నమోదు

 
ఇంద్రకీలాద్రి : దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన  బయోమెట్రిక్ విధానంతో సిబ్బందికి  కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏప్రిల్‌లో 8 నుంచి పది రోజులకు పైగా విధులకు హాజరు కానట్లు బయోమెట్రిక్‌లో నమోదు కావడంతో మిషన్‌ల పనితీరుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  ఏప్రిల్ ఒకటి నుంచి దుర్గగుడి సిబ్బందికి  బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అయితే రోజూ విధులకు హాజరైనా కొంత మందికి 20 రోజులు మాత్రమే పని చేసినట్లు నమోదు కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది గొల్లుమంటున్నారు. ఏఈవో స్థాయి అధికారులతో పాటు సూపరింటెండెంట్లు, దిగవ స్థాయి సిబ్బంది సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

రెండు రోజులుగా గుడిపై ఏ ఇద్దరు సిబ్బంది కలిసినా బయోమెట్రిక్‌పైనే చర్చ జరుగుతోంది. బయోమెట్రిక్ విధానంవల్ల నష్టపోయే సిబ్బంది పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయో మెట్రిక్ హాజరుతో పాటు ప్రత్యేకంగా ఒకరికి హాజరు నమోదుపై పర్యవేక్షణ అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


 చిక్కులు ఎన్నో...
బయో మెట్రిక్‌తో చిక్కులు అన్నీ, ఇన్నీ కావని ఆలయ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ యంత్రాలు ఏర్పాటు చేసి నెల కాక ముందే హాజరు కోసం తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మూడు చోట్ల బయో మెట్రిక్ యంత్రా లు ఏర్పాటు చేశారు. ఆలయంలో రెండు షిఫ్టులలో 306 మంది శాశ్వత సిబ్బంది, 60 మంది ఎన్‌ఎంఆర్‌లు, మరో 35 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్టున్నారు.  


బొటన వేలు,  చూపుడువేలి ముద్రతో పాటు ఐరిస్‌ద్వారా హాజరు తీసుకునేలా బయోమెట్రిక్ పరికరాలలో సాప్ట్‌వేర్‌ను పొందుపరిచారు. ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. మరికొన్ని విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం వచ్చి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. అయితే (అదనపు విధులు)  ఓటీ చేస్తున్న వారిని ఏ విధంగా నమోదు చేస్తారనే దానిపై సృష్టత లే కపోవడంతో చిన్న స్థాయి సిబ్బంది తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామంటున్నారు.

మరిన్ని వార్తలు