కళావిహీనంగా భైరవకోన అందాలు

26 Sep, 2019 12:45 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : అది ప్రకాశం జిల్లాలోనే అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం... అందమైన ఎత్తయిన జలపాతం ప్రకృతి అందాలతో భక్తులనే కాక పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షించే దివ్య శైవ క్షేత్రం. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షానికి ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిని కళావిహీనంగా మారడం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అదే ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలంలోని చారిత్రిక శైవ క్షేత్రం భైరవకోన త్రిముఖ దుర్గాంబ దేవి ఆలయం.

ఎత్తయిన కొండలు.. జలజలా జాలువారే జలపాతం.. ఒకే రాతి పై చెక్కిన వివిధ శైవ ఆలయాలు... మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి సౌందర్యం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ప్రాంతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా దెబ్బతింది. భైరవకోనకు చేరుకునే ఆర్ అండ్ బి రహదారులు ధ్వంసమై రాకపోకలకు వీలు లేకుండా పోయింది. ప్రాచీన గుడికి దగ్గర్లోని కళావేదిక అన్నదాన సత్రం, అతిథి గృహం దెబ్బతిన్నాయి. భైరవకోన ఆలయం చుట్టూ ఉండే కొండ ప్రాంతం నుండి కొండ చరియలు విరిగిపడటంతో భారీగా రాళ్లు కొట్టుకు వచ్చి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను కప్పివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

ప్రకృతి సోయగాలతో పర్యాటకులను మైమరిపిస్తున్న బైరవకోన క్షేత్రం ఇలా కళావిహీనంగా మారడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారులు తక్షణం స్పందించి దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతి పదికన పునర్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అక్కడికి వచ్యే భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న రాళ్ల గుట్టలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. అలాగే దెబ్బతిన్నకళా భవనం, అన్నదాన సత్రం, అతిథి గృహలను వెంటనే నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు