అమ్మా.. బరువయ్యానా?

20 Feb, 2019 13:33 IST|Sakshi
శిశువును పరీక్షిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేంద్రసింగ్‌

అమ్మా.. తొమ్మిది నెలలు నన్ను మోశావు.. నీ కడుపులో చిన్న దెబ్బ తగులకుండా కాపాడావు.. అటూ ఇటూ తిరుగుతుంటే.. నా కాళ్లతో తన్నుతూ ఉంటే భరించావు.. చివరకి నిన్ను చూడాలని ఎంతో సంతోషంగా నేను బయటకు వస్తే నన్ను ఇలా చెత్తకుప్పలో పడేశామేమిటమ్మా.. నీ కడుపులో నుంచి బయటకు రావడమే నేను చేసిన తప్పా.. ఇన్నాళ్లూ బరువుగా లేని నేను ఇప్పుడు బరువయ్యానా.. రా అమ్మా.. చీమలు కుడుతున్నా యి.. కుక్కలు, పందులు వాసన చూస్తున్నాయి.. భయమేస్తోం దమ్మా.. నీ పొత్తిళ్లలో పెట్టుకుని ధైర్యమివ్వమ్మా! ఇదీ                నూజివీడులోని ఢంఢం గార్డెన్‌ ప్రాంతంలో చెత్తాచెదారం మధ్య దొరికిన శిశువు ఆక్రందనకు అక్షరరాగం.  

కృష్ణాజిల్లా, నూజివీడు: ఎవరో తెలియనివారి పిల్లలకు.. మన కళ్ల ముందు కాస్త దెబ్బ తగిలితేనే అయ్యో అంటూ జాలి చూపుతాం.. ఇక్కడ నవ మాసాలూ మోసి, పేగు తెంచుకు పుట్టిన బిడ్డను ఓ కర్కశ తల్లి చెత్తకుప్పల పాలు చేసింది. పట్టణంలోని ఢంఢం గార్డెన్‌లోని  చెత్తాచెదారం మధ్యలో పడేసిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఉదయం 7.30 గంటల సమయంలో ఢంఢం గార్డెన్‌కు చెందిన రేచల్‌ సుమేధ అనే మహిళ శిశును గమనించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శిశువును బరువు తూచగా 1.8 కేజీలు బరువు ఉందని.. ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉన్నప్పటికీ చీమలు కుట్టడం వల్ల శరీరం అక్కడక్కడ ఎర్రగా కంది ఉందని తెలిపారు. మెరుగైనా చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో జి. మంగమ్మ, సూపర్‌వైజర్‌ కాగిత కుమారిలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని శిశువును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు