పట్టుబడిన అడవి దున్న

11 Aug, 2013 04:24 IST|Sakshi
వెలిచేరు (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : దారి తప్పి వెలిచేరు గ్రామంలోకి చేరుకుని వీరంగం సృష్టించిన అడవి దున్నను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు శనివారం బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆత్రేయపురం మండలం వెలి చేరు ఊదలమ్మ గవళ్ల పాలెం సమీపంలో అడవి దున్న శుక్రవారం అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలి సిందే. పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలం చెందడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. శనివారం ఉదయం విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు చెందిన మత్తు వైద్యుడు శ్రీనివాసరావు తుపాకీతో అడవి దున్నకు మత్తు ఇచ్చారు. 
 
 అది సరిగా పనిచేయకపోవడంతో సమీపంలో ఉన్న ఏటిగట్టుపైకి వచ్చి ప్రజలను పరుగులు తీయించింది. వారంతా భయాందోళనకు గురయ్యారు. చాకచక్యంగా మళ్లీ మత్తు మందు ఇవ్వడంతో కొద్దిసేపటికి స్పృహ కోల్పోయింది. అనంతరం అటవీ శాఖ, పోలీసుల సహాయంతో అడవి దున్న తలకు గుడ్డ కట్టి, కాళ్లను తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో అరటి తోట నుంచి ఏటుగట్టుపై ఉన్న అటవీ శాఖకు చెందిన వ్యాన్‌లోకి చేర్చారు. 
 
 జిల్లా అటవీ శాఖ అధికారి సీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దున్నను మారేడుమిల్లి సమీపంలోని అడవిలో వదలి పెట్టనున్నట్టు తెలిపారు. దీనిని బంధించేందుకు సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దున్న దాడిలో తీవ్ర గాయాలపాలైన చీలి వెంకన్న ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాకినాడ ఫారెస్టు రేంజ్ అధికారి నర సింహా రావు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఎస్సై సత్యనారాయణ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు