కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

4 Apr, 2020 02:18 IST|Sakshi

రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని కూడా తగ్గించామని చెప్పారు.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 140 కేసులు ఢిల్లీలో జమాతే సదస్సులో పాల్గొన్నవారేనని తెలిపారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ కరోనా కట్టడికి శ్రమిస్తోందన్నారు. ప్రత్యేకించి పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తున్నారని వివరించారు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా రైతులు, కూలీలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు గవర్నర్‌ చెప్పారు. కానీ వారు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించామన్నారు.

>
మరిన్ని వార్తలు