ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన దిగుబడి

18 Nov, 2019 05:39 IST|Sakshi
రైతు మైనేని గణేష్‌తో మాట్లాడుతున్న గవర్నర్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

రంగన్నగూడెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌): తక్కువ పెట్టుబడి, ఆరోగ్యవంతమైన పంటల ఉత్పత్తికి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా రంగన్నగూడెంలోని ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న వరి క్షేత్రాలను గవర్నర్‌ ఆదివారం పరిశీలించారు. కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు గ్రామానికి చెందిన రైతులతో కలిసి గవర్నర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం యువరైతు మైనేని గణేష్‌ సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గవర్నర్‌ సందర్శించారు. అతనితో ప్రకృతి వ్యవసాయ విధానం, జీవ రసాయనాల తయారీ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తిపై అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి, స్వగ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎందరో యువకులకు ఆదర్శంగా నిల్చిన మైనేని గణేష్‌ను గవర్నర్‌ అభినందించారు. కృత్రిమ ఎరువులు, రసాయనాలను వినియోగించకపోవటం వల్ల ఎకరాకు దాదాపు రూ.15 వేలు పెట్టుబడి వ్యయం తగ్గిందని, ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పంటకు సగటున ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని గవర్నర్‌కు గణేష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు