రాజ్యాంగంలో ప్రజలకు రక్షాకవచాలు 

27 Nov, 2019 04:42 IST|Sakshi
రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడుతున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాలు 

సాక్షి, అమరావతి/ఏఎన్‌యూ (గుంటూరు): రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను పౌరులు పరిరక్షించుకోవడమే కాకుండా ప్రాథమిక విధులకు కూడా కట్టుబడి ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉద్బోధించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించకూడదన్నారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం రక్షాకవచంగా న్యాయ, పాలనా వ్యవస్థలను తగిన విధంగా ఏర్పరచిందన్నారు. పౌరులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, అదే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని మరువరాదని చెప్పారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేది కూడా రాజ్యాంగం నిర్దేశించిందని పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్ది, అభివృద్ధి దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.  

కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటామని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తామని గవర్నర్‌ అందరితో ప్రమాణం చేయించారు.  ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో  గవర్నర్‌ విశ్వభూషణ్‌హరిచందన్‌తో పాటు మంత్రి  ఆదిమూలపు సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు