గవర్నర్‌గా విశ్వభూషణ్‌ ప్రమాణ స్వీకారం

25 Jul, 2019 04:02 IST|Sakshi
విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న విశ్వభూషణ్‌ హరిచందన్‌. ఆయనతో ప్రమాణం చేయిస్తున్న ఏసీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు

విజయవాడ రాజ్‌భవన్‌లో ఘనంగా కార్యక్రమం

ఆయనతో ప్రమాణం చేయించిన హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ 

సీఎం వైఎస్‌ జగన్, విపక్షనేత చంద్రబాబు.. ఇతర ప్రముఖుల హాజరు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం ఉదయం 11.29 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి విశ్వభూషణ్‌ కార్యక్రమ వేదికపైకి వచ్చారు.
నూతన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వును చదివి వినిపించి, ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. సరిగ్గా 11.30 గంటలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌.. హరిచందన్‌తో పదవీ ప్రమాణం చేయించారు. గవర్నర్‌ దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సతీమణి సుప్రభ హరిచందన్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బాధ్యతలు నిర్వహించడం తెలిసిందే. ఇప్పుడు హరిచందన్‌ పదవీ ప్రమాణంతో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ బాధ్యతలు చేపట్టినట్టయింది.

నూతన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరుల గ్రూప్‌ ఫొటో 

కన్నుల పండువగా సాగిన కార్యక్రమం..
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నియమితులైన తొలి గవర్నర్‌ కావడంతో విశ్వభూషణ్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో కన్నుల పండువగా సాగింది. ప్రాంగణమంతటినీ రంగురంగుల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, అంజాద్‌ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, ఎం.శంకరనారాయణ్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గవర్నర్‌ కార్యదర్శి ఎం.కె.మీనా, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, జీఏడీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌తో సహా పలువురు సీనియర్‌ అధికారులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన తేనీటి విందులో గవర్నర్‌తో సహా ఆహూతులందరూ పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిసి రాజ్‌భవన్‌ ప్రాంగణంలో గ్రూప్‌ ఫొటో దిగారు. 
రాజకీయ దిగ్గజం..
విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఒకప్పటి బన్‌పూర్‌ రాజవంశానికి చెందినవారు. ఆయన పూర్వీకులు కుర్దా జిల్లాలోని భటపడా గఢ్‌కు పాలకులుగా ఉన్నారు. హరిచందన్‌ 1934, ఆగస్టు 3న పరశురామ్‌ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే చురుగ్గా వ్యవహరించేవారు. కళాశాల రోజుల్లో క్రీడాకారుడిగా, మంచి వక్తగా పేరు గడించడమేగాక విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు. పూరీ కళాశాల నుంచి ఎకనామిక్స్‌(ఆనర్స్‌) పట్టాను, కటక్‌ ఎమ్మెస్‌ లా కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 1977లో జాతీయ కౌన్సిల్‌ సభ్యులయ్యారు. 1980లో బీజేపీకి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగాను, జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగాను పనిచేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం, స్వేచ్ఛకోసం రాజీలేని పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 1975లో జైలుకెళ్లారు. ఒడిశా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

జయప్రకాష్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవంలో యువనేతగా కీలక పాత్ర పోషించారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన హరిచందన్‌ 1977లో ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారు. 1977లో ఛిల్కా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒడిశా ప్రభుత్వంలో న్యాయ, ఆహార, పౌరసరఫరాలు, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1990లో బిజూ పట్నాయక్‌ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల మంత్రిగా ఉన్నారు. 1996లో భువనేశ్వర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొంది బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మళ్లీ 2000 సంవత్సరంలో 97,536 ఓట్ల భారీ ఆధిక్యతతో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ–బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004లోనూ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా రాష్ట్రం కోసం, ఒడిశా ప్రజల కోసం రాజీలేని పోరాటాలు చేసిన హరిచందన్‌ రాష్ట్రంలో ప్రముఖ కాలమిస్ట్‌గానూ పేరుపొందారు. అనేక అంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. 
​​​​​​​

>
మరిన్ని వార్తలు