అడవి బిడ్డలతో హరిచందన్‌  

1 Nov, 2019 06:14 IST|Sakshi
 గవర్నర్‌ను గిరిజన సంప్రదాయంలో సత్కరిస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే రాజన్నదొర, జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తదితరులు

ఏజెన్సీలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ సుడిగాలి పర్యటన 

గిరిజన రైతులు, విద్యార్థులతో ముఖాముఖి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా 

గిరిశిఖర గర్భిణుల వసతిగృహ నిర్వహణపై సంతృప్తి 

హరిత విజయనగరంలో పాలు పంచుకున్న ప్రథమ పౌరుడు 

గవర్నర్‌ రాకతో మన్యం మురిసింది. గిరిజనం సంతసించింది. అడవిబిడ్డల కోసం ప్రత్యేకంగా వచ్చిన అతిథిని చూసి ఉప్పొంగిపోయింది. తమ సమస్యల గురించి ఆరా తీసినపుడు... బాగోగుల గురించి ప్రస్తావించినపుడు... తాము పండించిన పంటలను చూసి ప్రశంసించినపుడు... తమకు అందుతున్న సౌకర్యాల గురించి ప్రశ్నించినపుడు తమపై వారెంత బాధ్యతగా ఉన్నారో స్పష్టమైంది. సుమారు నాలుగైదు గంటలపాటు తమతో గడిపిన ఆ అతిథిని గర్వంగా సాగనంపింది. 

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరి చందన్‌ జిల్లా పర్యటన విజయవంతమైంది. గిరిజనులకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు గవర్నర్‌ తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన పర్యటనలో గర్భిణులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడగా అందరూ గిరిజనులు కావడం పర్యటన ప్రాధాన్యత తెలియజేసింది. ఈ సందర్భంగా హరిత విజయనగరం సంకల్పంలో గవర్నర్‌ సైతం పాలుపంచుకున్నారు. మొక్కలు నాటి తన పర్యటనకు మొదలుపెట్టారు. అందరూ విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. గిరిజన బాలికలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ముగించారు.  

నాలుగు గంటలు బిజీబిజీగా... 
రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరి చందన్‌ ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం సాలూరు డీగ్రీ కాలేజీ మైదానానికి ఉదయం 11.32 నిమిషాలకు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సాలూరు పట్టణంలో ఉన్న గుమడాం వద్ద గల యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు చేరుకుని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్‌కు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆర్‌.పి.సిసోడియా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పార్వతీపురం ఐటీడీఏ ఏర్పాటు గురించి వివరించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ గవర్నర్‌కు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, జిల్లాలో అమలు చేస్తున్న కంటివెలుగు, రైతుభరోసా, వాహనమిత్ర, తదితర పథకాలు గురించి సమగ్రంగా వివరించారు.
 
అమ్మవలస సభకు హాజరైన గిరిజనులు 
గర్భిణుల ఆరోగ్యంపై ఆరా... 
వైటీసీలోని    గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని గవర్నర్‌ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న గర్భిణులతో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలావుంది? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మీ ఊరు నుంచి ఎలా వచ్చారు? మీ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం ఉన్నాయా? వసతిగృహంలో ఎటువంటి వైద్య సేవలు ఆందుతున్నాయని ప్రశ్నించారు. వసతిగృహంలో మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు వున్నాయని, ప్రసవ సమయంలో గిరిశిఖర ప్రాంతాలనుంచి వైద్యం నిమిత్తం రావడం చాలా కష్టంగా వుండేదని పలువురు గర్భిణులు తెలిపారు. ఈ వసతిగృహం వల్ల గిరిజనులకు మంచి జరుగుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రకృతి సేద్యానికి ప్రశంస 
అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పాచిపెంట మండలం అమ్మవలస చేరుకున్నారు. అక్కడ గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, కంద, మామిడి, జీడిమామిడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర వ్యవసాయ పద్ధతుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా రైతులు వాటి గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామసభలో పాల్గొన్నారు. సభలో రైతులతో మాట్లాడారు. రైతులకందుతున్న ప్రభుత్వ పథకాల గురించి రైతులను అడుగ్గా కె.విజయ్‌ అనే రైతు మాట్లాడుతూ రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రూ.7500లు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్‌ యోజన పథకం ద్వారా రూ.2000 ఇచ్చారని, పంట సాగుకు పెట్టుబడికి సాయం అందించినట్టయిందని తెలిపారు.

ఆరోగ్య కార్యకర్తలు తనిఖీలు, పౌష్టికాహారం పంపిణీ, మందులు సరఫరా గురించి గవర్నర్‌ అడుగ్గా క్రమ పద్ధతిలో తనిఖీ చేసి, పౌష్టికాహారం, మందులు సరఫరా చేస్తున్నారని గిరిజన మహిళ లక్ష్మి తెలిపారు. అనంతరం ఆయన పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల జూనియర్‌ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్య, కాలేజీ, వసతిగృహంలో సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకల్లో పాల్గొని, గిరిజన బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

వైద్యసదుపాయాలు మెరుగు: డిప్యూటీ సీఎం 
అమ్మవలస సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఏజెన్సీలో వైద్యసదుపాయా ల మెరుగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోం దని తెలిపారు. గిరిజనులు తక్కువగా ఉన్న కొత్తవలస ప్రాంతంలో పెట్టిన గిరిజన యూనివర్శిటీని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సాలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారనీ, ఏడు ఐటీడీఏల పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలు ముఖ్యమంత్రి రద్దు చేసిన విషయాన్ని తెలియజేశారు. 

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రాజన్నదొర 
అమ్మవలసలో నిర్వహించిన సభలో సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సందర్శనకు గవర్నర్‌ రావడం సంతోషంగా ఉందనీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారనీ తెలిపారు. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాలూరు ప్రాంతంలో ధీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య 21 కొఠియా గ్రామాల సమస్య నలుగుతోందనీ, వీరి సమస్య పరిష్కరించాలని కోరారు. గిరిజనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. స్పందించిన గవర్నర్‌ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హెలిప్యాడ్‌ వద్దకు చురుకున్న గవర్నర్‌ పర్యటన విజయవంతంపై జిల్లా అధికారులను అభినందించి, వారితో గ్రూఫ్‌ఫొటో దిగారు. అనంతరం గవర్నర్‌ విశాఖ బయలుదేరి వెళ్లారు.  

ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.పి.సిసోడియా, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, బొబ్బిలి, పాడేరు ఎమ్మెల్యేలు శంబంగి చిన్న అప్పలనాయుడు, కె.భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, విశాఖ రేంజ్‌ డీఐజీ కాళిదాసు రంగారావు, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్, జిల్లా ఎస్‌.పి.రాజకుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు