చవకబారు ఆరోపణలొద్దు!

22 Oct, 2013 02:30 IST|Sakshi
మత ప్రబోధకులు బ్రదర్ అనిల్ కుమార్‌కు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎయిర్‌షోలో బ్రదర్ అనిల్ పాల్గొన్న దృశ్యాన్ని చూపించి కుంభకోణంలో పాత్ర అంటూ ఆరోపణలు చేయడం సరికాదని సోమవారం క్లాస్ తీసుకున్నారు. మీడియాలో ప్రచారం కోసం చవకబారు ఆరోపణలకు దిగొద్దని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆ సందర్భంలో తన వాదనను సమర్ధిం చుకునేందుకు ప్రభాకర్ ఇబ్బంది పడినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. 
 
 తన వద్ద ఉన్న కొన్ని కాగితాలను చూపించి ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గాలి కబుర్లను పోగేసి ఏవేవో వెబ్‌సైట్లలో ఉంచిన సమాచారాన్ని తానేదో శోధించి కనుగొన్నట్టు మీడియాకు చెప్పడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఫలితమేముండదని పేరు రాయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నేత ఒకరు ధ్వజమెత్తారు. ఏదైనా విమర్శ లేదా ఆరోపణ చేసే ముందు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మరో నాయకుడు సూచించారు. ప్రభాకర్ ఎవరి చేతిలోనో పావుగా మారి ఇటువంటి ఆరోపణలకు దిగారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. ‘ఇటువంటి వ్యక్తిని మా నాయకుడు ఎలా ప్రధాన కార్యదర్శిని చేశారో అర్థం కావడం లేద’ని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభాకర్ చెప్పిన విషయాల్ని ఖండిస్తే పార్టీ పరువు పోతుందని మిన్నకుండిపోయామే తప్ప లేదంటే గట్టిగానే బయటకు చెప్పేవారమని అన్నారు.
మరిన్ని వార్తలు