బీజేపీకి కాంగ్రెస్‌ పోటినిచ్చేది.. కానీ..

30 Aug, 2019 13:14 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడం ఖాయమని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. బీజేపీకి పోటీనివ్వగలిగే పార్టీగా కాంగ్రెస్‌ ఉండేదని, కానీ ఆ పార్టీ సంక్షోభంలో పడిందని ఎద్దేవా చేశారు. రాహుల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే.. వయోఃభారంతో బాధపడుతున్న సోనియాను పార్టీ అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ నియమించిందని చురకలంటించారు. ఐఎంఐ హాలులో శుక్రవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు.

నిధులిస్తే గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది..
హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని చెబుతున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణం అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి భాను ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్డొన్నారు.

>
మరిన్ని వార్తలు