నటుడు శివాజీని అరెస్ట్‌ చేయాలి: పైడికొండల

26 Oct, 2018 16:53 IST|Sakshi
పైడికొండల మాణిక్యాల రావు

కాకినాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడుతూ..జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నమేనని వెల్లడించారు.

ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. గతంలో కూడా విశాఖ రన్‌వేపై రాష్ట్రానికి చెందిన పోలీసులే జగన్‌ను అడ్డుకోవడం చూశామని గుర్తు చేశారు. ఆపరేషన్‌ గరుడ అంటూ నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ జగన్‌పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు.

ఒక వేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్‌గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్‌ గరుడ వెనక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ ఆపరేషన్‌ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు