అవినీతి సొమ్ము కక్కించేదాకా బీజేపీ నిద్రపోదు

16 Feb, 2020 20:41 IST|Sakshi

బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్‌ బాజీ

సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడినా కూడా టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్‌ బాజీ నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పీఏ వద్ద దొరికిన డబ్బుని చాలా చిన్న విషయంగా టీడీపీ ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. టీడీపీ నేతల మెదళ్లకు తెగులు పట్టుకుందని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన లెక్కల తుట్టె కదులుతుంటే టీడీపీ నేతల మతి పోతోందని విమర్శించారు. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దోపిడీ చేసిందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీజ్‌ చేసిన అన్నింటికీ ఐటీ అధికారులు రశీదులు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఐటీ అధికారులను రాకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారో  ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు..
రెండు వేల కోట్లు దొరికితే తక్కువేనంటూ టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని.. కోటాను కోట్లు అక్రమంగా సంపాదించిన తమకు రెండు వేల కోట్లు చిన్నవిగా కనిపిస్తున్నాయని అర్థమవుతోందన్నారు. మరో బుద్ధుడు, గాంధీలా చెప్పుకునే చంద్రబాబు ఐటీ అధికారులకు దొరికిన రెండు వేల కోట్లపై సమాధానం చెప్పాలన్నారు. పసుపు దొంగలు నాలుగేళ్లు సంపాదించిన అక్రమ సంపాదనను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రాజెక్టులు, నీరు-చెట్టు, మరుగు దొడ్ల పథకం, ఉపాధి హామీలో తిన్న డబ్బుల మొత్తాన్ని కక్కించేదాక బీజేపీ నిద్రపోదన్నారు. చంద్రబాబు కార్యదర్శి షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి రెండు వేల కోట్లను అక్రమంగా విదేశాలకు తరలించారనేది ఐటీ అధికారులు స్పష్టంగా తేటతెల్లం చేశారని పేర్కొన్నారు. మొత్తం 40 ప్రాంతాల్లో సీజ్‌ చేసిన 25 లాకర్ల వివరాలు బయటకు రావాల్సి ఉందని చెప్పారు. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తిపై ఐటీ దాడులు జరిగితే సంబంధింత వ్యక్తిది బాధ్యత కాదా?  అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం  చెప్పే దమ్ము టీడీపీ నాయకులకు ఉంటే బహిరంగ చర్చకు రావాలని బాజీ సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు