భూబకాసురుడు చంద్రబాబే !

9 Sep, 2019 10:54 IST|Sakshi
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి  

సాక్షి, అనంతపురం : అమరావతిలో రాజధాని పేరుతో 35వేల ఎకరాల భూములను రైతుల నుంచి దౌర్జన్యంగా లాక్కొన్న భూబకాసరుడు మాజీ సీఎం చంద్రబాబు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనలో ఏనాడూ రాయలసీమ నుంచి రాజధానికి రోడ్డు వేయడాన్ని పట్టించుకోని వ్యక్తి నేడు అమరావతిపై మాట్లాడడం సిగ్గుచేటంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. టీడీపీకి అధికారం కట్టబెట్టలేదన్న అక్కసుతో రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ అంటే చాలు చంద్రబాబు భయంతో స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.

నిజంగా ఆయన నిజాయితీ పరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ రెండవ రాజధాని విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాయలసీమ జిల్లాలో కరువు, రైతు ఆత్మహత్యలు, రాజధాని విషయంపై ఈ నెల 14న కడపలో తలపెట్టిన సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి,  ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు