ప్రతిష్టాత్మకంగా బీజేపీ సభ్యత్వ నమోదు

6 Feb, 2015 00:59 IST|Sakshi
ప్రతిష్టాత్మకంగా బీజేపీ సభ్యత్వ నమోదు
  • జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో కిషన్‌రెడ్డి సమీక్ష
  • సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీజేపీ చేపట్టిన ఆన్‌లైన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన సమావేశమయ్యారు.

    ఆన్‌లైన్ సభ్యత్వం, జిల్లాల వారీగా స్పందన, 35 లక్షల నిర్దేశిత లక్ష్యం వంటి అంశాలపై సమీక్షించారు. తెలంగాణలో సభ్యత్వం మందకొడిగా ఉందని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆయన వివరించారు.  పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, లోపాలను సరిదిద్దుకోవాలని నేతలకు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ అగ్రనేతలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.
     
    జీవితకు నామినేటెడ్ పదవిపై పెదవి విరుపు..

    కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎవరికీ నామినేటెడ్ పదవులు పెద్దగా దక్కడం లేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన నటి జీవితకు నామినెటెడ్ పదవి ఎలా వచ్చిందంటూ కొందరు జిల్లా అధ్యక్షులు కిషన్‌రెడ్డిని నిలదీశారు. అయితే ఆమె నియామకానికి పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధం లేదని ఆయన బదులిచ్చారు. జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ల జాబితాను జాతీయ నాయకత్వానికి అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు