రాజకీయ వాడీ వేడీ

14 Jul, 2018 09:45 IST|Sakshi
జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి గడ్కరీ, వేదికపై సీఎం చంద్రబాబు తదితరులు

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు):  విశాఖపట్నం జిల్లా శంకుస్థాపనల సభలో రాజకీయ నినాదాలు హోరెత్తాయి. సీఎం చంద్రబాబు వస్తుండగా మోదీకి జైకొట్టిన బీజేపీ కార్యకర్తలు.. వారిపై టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు అధికారిక కార్యక్రమాన్ని అపహాస్యం చేశాయి. చివరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ‘మీరు మౌనం వహిస్తే నేనుంటాను, లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను’ అంటూ బీజేపీ, టీడీపీ శ్రేణులను వారించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన 7 ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం బీజేపీ, టీడీపీ శ్రేణుల మధ్య రగులుతున్న అంతర్గత  వైషమ్యాలకు వేదికగా నిలచింది. వారి మధ్య దూరాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది.

బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తమ పార్టీ కండువాలతో సమావేశ మందిరంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలోనికి అడుగుపెడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోది.. మోది అంటూ నినాదాలు చేశారు. దీనితో భిన్నుడైన ముఖ్యమంత్రి కొంత అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు భారత మాతాకీ జై, మోదీకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన గడ్కరీ స్వయంగా మైక్‌ అందుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది తన శాఖ కార్యక్రమమని, తన ఆహ్వానంపై ముఖ్యమంత్రి సమావేశానికి వచ్చారని వివరించారు. సావధానంగా ఉంటే అందరి సమస్యలు తాను వింటానని, మీ ఆవేదన అర్ధం చేసుకోగలనంటూ మాట్లాడారు. దీనితో కొద్దిసేపు ఇద్దరూ శాంతించారు. నిర్వాహకులు తనకు అందించిన పుష్పగుచ్చాన్ని స్వయంగా నితిన్‌ గడ్కరీ ముఖ్యమంత్రికి అందజేసి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి తనను నిర్వాహకులిచ్చిన పుష్పగుచ్ఛాన్ని గడ్కరీకి ఇచ్చి పరస్పరం అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ప్రసంగాల సమయంలోనూ ఆగని నినాదాలు
ప్రసంగాలు జరుగుతున్నంతసేపూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్యుగ్ధం జరిగింది. పోలవరం మోదీ వరం, మోదీ, మోదీ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దెత్తున నినాలు చేశారు. వీరికి సమాధానం చెబుతూ చంద్రబాబు జిందాబాద్‌ అంటూ టీడీపీ కార్యకర్తలు నినదించారు.  హోమ్‌ మంత్రి చినరాజప్ప, మంత్రి అయ్యన్నపాత్రుడు మైక్‌ అందుకుని కార్యకర్తలకు సర్దిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఎంపీ హరిబాబు మాట్లాడుతున్న సమయంలో రైల్వేజోన్‌ విషయాన్ని కొంతమంది లేవనెత్తారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.రాధక్రిష్ణన్, మన్‌కుస్‌ ఎల్‌ మాండవీయ, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్‌ మాధవ్, సోము వీర్రాజు, ఎం.వి.వి.ఎస్‌ మూర్తి, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూరి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్‌రాజు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌ కుమార్, పీలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలం భవాని తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు