చెన్నారెడ్డినే తరిమిన వాళ్లం.. చంద్రబాబు మాకెంత..!

29 Sep, 2018 12:01 IST|Sakshi

చంద్రబాబు మాకెంత..!  

విలేకరులతో బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు 

హామీల అమలు కోరుతూ మౌనదీక్ష

తాడేపల్లిగూడెం: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకోవాలని టీడీపీ నాయకుడు ఒకరు ఛాలెంజ్‌ చేశారు. మర్రి చెన్నారెడ్డిని తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్‌ చంద్రబాబును తరమడం పెద్ద కష్టం కాదని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని, చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం స్థానిక హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో మౌన పోరాట దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడితే వెనుకడుగు వేయమని హెచ్చరించారు.

శనివారం ధర్మపోరాట దీక్షలో గూడెంకు ఇచ్చిన హామీల అమలులో అధికార పార్టీ నాయకుల స్పందనపై మా పోరాటం ఆధారపడి ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్ష చేసుకోడానికి ఈ ప్రాంతం పనికొచ్చింది కాని, ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడానికి పనికిరాదా అన్నారు. 2015 ఆగస్టులో నిట్‌ వేదికపై నుంచి ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేస్తే, మిగిలిన ఐదు శాతం హామీల అమలు కోసం ధర్మపోరాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. గూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎంపై ఏ పోరాటం చేయాలన్నారు.

సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పి సభ నిర్వహించుకోవాలన్నారు. మౌనపోరాటం చేస్తామని ప్రకటించాక విమానాశ్రయ భూముల్లో 1800 మందికి పట్టాలు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. విమానాశ్రయ భూముల్లో 5300 మంది పట్టాదారులుంటే కేవలం 1800 మందికి ఇస్తాననడం సరికాదు. అందరికీ పట్టాలిస్తానని సభలో ప్రకటించాలని మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర చేస్తూ టీడీపీ వారిని ప్రశ్నిస్తున్నారని ఆయనపై దాడికి రెక్కీ నిర్వహిస్తే ప్రభుత్వం కళ్లు తేలేసి చూస్తుందా అన్నారు. అభిమాన నటుడుగా ఉన్న పవన్‌కల్యాణ్‌కు అన్యాయం జరిగితే మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు.

శాంతియుతంగా మౌనదీక్ష చేస్తున్న మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా కర్ర చేత్తో పట్టుకోడానికి సిద్ధమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్షీనారాయణ, మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి శరణాల మాలతీరాణి, పార్టీ నాయకులు ఈతకోట తాతాజీ, యెగ్గిన నాగబాబు, నరిశే సోమేశ్వరరావు, ధనలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. సాధిద్దాం.. పట్టాలు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మౌన పోరాట దీక్ష సాగింది. ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి కూడా దీక్షలో పాల్గొన్నారు.   

శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం
శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలే దీనికి నిదర్శనమని మాణిక్యాలరావు అన్నారు. ఇంటెలిజెన్సు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై దాడికి రెక్కీ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రక్షణ కొరవడిందన్నారు. పసుపు తమ్ముళ్ల రక్షణకే పోలీసు బలగం సరిపోతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు, ప్రతిపక్ష నేతల రక్షణకు ప్రత్యేక వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు