ఫైబర్‌ గ్రిడ్‌ మాయ.. బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్ట్రా!?

22 Jul, 2019 13:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒక మాయ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రూ.149 రూపాయలకే కనెక్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎక్కువ వసూలు చేసిందని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని, విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైబర్ గ్రిడ్‌ను చేపట్టిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై ఈవీఏం ట్యాంపరింగ్ కేసు ఉందని, అతను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్‌ను అతనికి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు.

ఈ పథకం కింద నాసిరకం సెటప్‌ బాక్స్‌లు సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని కోరారు. దీనికి ఐటీ మంత్రి గౌతంరెడ్డి  సమాధానమిస్తూ.. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని,బెంగుళూరులో రూ.1200కు ఇస్తున్న సెటప్ బాక్స్‌లను ఏపీలో రూ. నాలుగువేలకు ఇస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ సమయంలో సెంటర్ విజిలెన్స్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని తెలిపారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఈవిచారణలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు.

పోలవరం అంచనాలపై చర్చ
రూ. 16వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఎలా పెంచారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శాసనమండలిలో ప్రశ్నించారు. ఈ అంశంపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పోలవర‌ంలో ఈపీసీ నుంచి 60సీకి ఇచ్చే అవకాశం లేదన్నారు.చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్వాసితులపట్ల కనీసం దృష్టి పెట్టలేదని విమర్శించారు. డ్యాం కడితే సరిపోదని, నిర్వాసితులను ఆదుకోవాలని, అది తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. పోలవరం కాపర్‌ డ్యాం పూర్తయితే.. 18వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయని, కనీసం ఆ కుటుంబాలకు గత ప్రభుత్వం నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు మొదలుపెడుతుందని వెల్లడించారు. పోలవరం కోసం తెచ్చిన ఏ మెటీరియల్‌ విషయంలోనూ ఆడిట్‌ చేయలేదని, పోలవరంలో జరిగిన అవకతవకలపై వారం రోజుల్లో సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. పోలవరాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, దానిని సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని జన్మలెత్తినా తెలుగుదేశం పార్టీ మాత్రం మరోసారి అధికారంలోకి రాదని అన్నారు.

>
మరిన్ని వార్తలు