ఐక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

16 Dec, 2013 02:09 IST|Sakshi

 చేవెళ్ల, న్యూస్‌లైన్ : రైతు బాంధవుడు, దేశ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహ నిర్మాణ యజ్ఞంలో భాగంగా బీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపుమేరకు ఆదివారం చేవెళ్లలో విద్యార్థులతో పెద్దఎత్తున ఐక్యతా రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. బ్రిటిష్ వారు శిస్తు చెల్లించని రైతుల భూములను స్వాధీనం చేసుకుంటుంటే తీవ్రంగా ప్రతిఘటించి భూములను వారికి తిరిగి ఇప్పించిన ధీశాలి సర్దార్ పటేల్ అన్నారు. స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుమారు 535 సంస్థానాలను విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. నిజాం ఎంత మొండికేసినా సైనికచర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయించిన ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ అని నివాళులర్పిం చారు.
 
 పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యూనిటీ రన్ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో రికా ర్డు సాధించబోతున్నదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాగృతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, వివేకానంద జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్, బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆంజనేయులుగౌడ్, మండల జేఏసీ కన్వీనర్ మర్ప ల్లి కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైదిగా గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి అందరూ తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం అయ్యప్ప దేవాలయం నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ఐక్యతా పరుగును నిర్వహించారు. వందలాది  విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని వందేమాతరం... భారత్‌మాతాకీ జై నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పరుగుతీశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంజర్ల ప్రకాశ్, జిల్లా నాయకులు జంగారెడ్డి, దేవర గోపాల్‌రెడ్డి, అత్తెల్లి విఠల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి,  చిలుకూరు గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.బాల్‌రాజ్, క్యామ పద్మనాభం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు